తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి' - కర్ణాటక పముఖ్యమంత్రి లక్ష్మణ్​ సవాడీ వార్తలు

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం తారస్థాయికి చేరుతోంది. కర్ణాటక సరిహద్దులోని మరాఠా ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే వ్యాఖ్యలపై మండిపడ్డారు కన్నడిగులు. ముంబయిలోనూ కన్నడ మాట్లాడేవారు ఉన్నారని.. తద్వారా ముంబయినే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్​ సవాడీ కౌంటర్​ వేశారు.

I request Central govt to declare Mumbai as a Union Territory: Karnataka Deputy CM Laxman Savadi
'ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి'

By

Published : Jan 28, 2021, 12:18 PM IST

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ ముదురుతోంది. కర్ణాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి‌.. ముంబయిని యూటీ చేయాలని కేంద్రాన్ని కోరారు.

కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఇటీవల ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదాలపై రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఠాక్రే.. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడి బెళగావి పేరు మార్చిందని ఆరోపించారు. సరిహద్దులో ఉన్న ప్రాంతాలను యూటీలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:దేశంలో 'భాషా జాతీయవాదం' చిచ్చు!

'ముంబయిపై మాకూ హక్కుంది'

ఠాక్రే వ్యాఖ్యలను తప్పుబట్టింది కర్ణాటక ప్రభుత్వం. "మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని విశ్వాసంగా ఉన్నాం. మా రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందినవారే. అందువల్ల ముంబయిపై మాకూ హక్కు ఉంది. ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలి. అప్పటి వరకు ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నా" అని లక్ష్మణ్‌ సవాడీ అన్నారు.

ఇదీ వివాదం..

ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెళగావి తదితర ప్రాంతాలు ఆ తర్వాత మైసూరు రాష్ట్రంలో కలిశాయి. అక్కడ ఎక్కువ మంది ప్రజలు మరాఠీనే మాట్లాడతారు. కాబట్టి వాటిని తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్‌ చేస్తోంది. దీనిపై బెళగావి కేంద్రంగా 1948లో ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాటం కొనసాగిస్తోంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జనవరి 17న ఆ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ తర్వాత.. బెళగావి తదితర ప్రాంతాలు కర్ణాటకలోనే ఉండాలంటూ మహజన్‌ కమిషన్‌ 1967లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను వ్యతిరేకిస్తోన్న మహరాష్ట్ర.. సరిహద్దు ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ఆ మధ్య ఈ వివాదం కాస్త సద్దుమణిగినట్లే కన్పించినా.. ఇటీవల ఠాక్రే వ్యాఖ్యలతో మళ్లీ రాజుకుంది.

ఇదీ చదవండి:'ఆ ప్రాంతాల విలీనమే నిజమైన నివాళి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details