తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ముంబయిలో రోజుకు 500 కిలోల డ్రగ్స్​ వినియోగం!' - Sushant Singh death case

సుశాంత్​​ సింగ్​ రాజ్​పుత్​ మరణానంతరం బాలీవుడ్​లో మత్తుపదార్థాల వినియోగంపై దర్యాప్తును విస్తృతం చేసింది మాదకద్రవ్యాల నియంత్రణ మండలి(ఎన్​సీబీ). ఈ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయని తెలిపారు ఎన్​సీబీ మాజీ అధికారి సుహాల్​ గోఖలే. ఒక్క ముంబయిలోనే 5 లక్షల మంది రోజుకు 500 కిలోల మత్తుపదార్థాలు వాడుతున్నట్లు వెల్లడించారు.

Mumbai consumes 500 kg of drugs daily,
ముంబయిలో రోజుకు 500 కిలోల డ్రగ్స్​ వినియోగం!

By

Published : Sep 17, 2020, 6:58 PM IST

బాలీవుడ్​ చిత్ర పరిశ్రమలో మత్తుపదార్థాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల డ్రగ్స్​ వినియోగిస్తున్న పలువురు నటుల వీడియోలు వైరల్​గా మారాయి. కొందరు నేరుగానే తాము మత్తుపదార్థాలకు బానిసలైనట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మత్తుపదార్థాల వినియోగంపై కీలక విషయాలు వెల్లడించారు.. మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం మాజీ అధికారి సుహాల్​ గోఖలే. బాలీవుడ్​లోనే కాక... పెద్దపెద్ద నగరాల్లోనూ డ్రగ్స్ వినియోగం భారీఎత్తున సాగుతోందని.. వాటి కట్టడికి కఠిన చట్టాలు అవసరమని పేర్కొన్నారు. ఒక్క ముంబయిలోనే రోజుకు 500 కిలోలు వినియోగిస్తున్నట్లు చెప్పారు.

ముంబయిలో రోజుకు 500 కిలోల డ్రగ్స్​ వినియోగం!

" నార్కోటిక్స్​ రీహాబ్​ కేంద్రంలో పని చేస్తున్న యుసఫ్​ మర్చంట్​ మత్తుపదార్థాలపై సర్వే నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. ఒక్క ముంబయిలోనే 5 లక్షల మంది హెరాయిన్​, గంజాయి, ఎండీ, హాసిస్​ వంటి వివిధ రకాల డ్రగ్స్​ వినియోగిస్తున్నట్లు తేలింది. వారు ఒక్కొక్కరు రోజుకు ఒక్క గ్రాము వినియోగించినా.. మొత్తం 500 కిలోలు అవుతుంది. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఒత్తిడి తగ్గించుకునేందుకు చాలా మంది మత్తుపదార్థాలను వినియోగిస్తున్నారు. సినీ పరిశ్రమలో చాలా మంది నటులు అలసిపోకుండా పనిచేసేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు డ్రగ్స్​ వాడుతున్నారని తెలిసింది. "

- సుహాల్​ గోఖలే, మాదకద్రవ్యాల నియంత్రణ మండలి మాజీ అధికారి.

గంజాయి వినియోగం..

"గంజాయి తక్కువ ధరకే లభించటం వల్ల పేదవారు దానికి బానిసలవుతున్నారు. ప్రస్తుతం విలువైన డ్రగ్స్​ను వాడటంపై వ్యామోహం పెరిగింది. అయినప్పటికీ గంజాయిని వివిధ రకాల పేర్లతో కళాశాలలు, పబ్బులు, రేవ్​ పార్టీలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ఐరోపా దేశాల్లో గంజాయి అమ్మకాలు, వినియోగానికి అధికారిక అనుమతులు ఉన్నాయి. కొన్నేళ్లుగా భారత్​లోనూ అధికారికంగా అమ్మకాలు జరపాలని డిమాండ్​లు వస్తున్నాయి. యువతరం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటిని నిషేధిస్తేనే మేలు జరుగుతుంది" అని అభిప్రాయపడ్డారు గోఖలే.

కొకెయిన్​ అక్రమ రవాణా..

దక్షిణ అమెరికా, పెరు, కొలంబియా దేశాల్లో భారీగా ఉత్పత్తి అవుతోన్న కొకెయిన్​ నైజీరియా, అఫ్గానిస్థాన్​, ఇరాన్​, పాకిస్థాన్ మీదగా భారత్​లోకి అక్రమ రవాణా అవుతోందన్నారు గోఖలే. గ్రాముల్లో ఉన్న కొకెయిన్​కే వేల రూపాయలు చెల్లిస్తున్నారని.. దానికి భారత్​లో చాలా డిమాండ్​ ఉందని తెలిపారు.

వీడియో కచ్చితమైన ఆధారం కాదు..

పలువురు బాలీవుడ్​ నటులు డ్రగ్స్​ వినియోగిస్తున్నట్లు ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అయితే.. కేవలం వీడియో ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవటం కుదరదని... పలు సాంకేతిక ఇబ్బందులు ఉంటాయని తెలిపారు గోఖలే. అలాంటి కేసుల్లో మూలాలను కనుక్కోవటం సాధ్యంకాదని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం-1985

1980లో భారత్​తో పాటు పలు దేశాల్లో మత్తుపదార్థాల స్మగ్లర్లు పేట్రేగిపోయారు. ముంబయిలోనూ వీరి కదలికలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 1985లో మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం-1985ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎవరైనా డ్రగ్స్​ విక్రయించినా, వినియోగించినా 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించేలా చట్టం చేశారు. ఒక్క గ్రాముతో పట్టుబడినా తీవ్రంగా శిక్షించేలా చట్టం రూపొందించారు. అయితే.. చాలా మంది ఈ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్​ చేస్తున్నట్లు చెప్పారు గోఖలే.

ఇదీ చూడండి:సుశాంత్ కేసు: మరొకరిని అరెస్ట్ చేసిన ఎన్​సీబీ

ABOUT THE AUTHOR

...view details