ముంబయి నగరం ఎప్పటికీ మహారాష్ట్రలో భాగమేనని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవార్ గురువారం మీడియాతో ఈ విధంగా స్పందించారు. 'ముంబయి ఎప్పటికీ మహారాష్ట్రకు చెందిన నగరమే. ఈ నగరం నిన్న, నేడు, రేపు ఎప్పటికైనా మనదే. దాన్ని ఎవరూ మార్పు చేయలేరనే విషయం అందరికీ తెలుసు. కర్ణాటక డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు' అని పవార్ స్పష్టం చేశారు.
'కర్ణాటకలోని మరాఠీ ప్రాంతాల విలీనానికి కట్టుబడి ఉన్నామంటూ.. ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు, ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సవాడి చేసిన డిమాండుకు మధ్య ఎలాంటి పొంతన లేదు. కేవలం కర్ణాటక ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఏదో చిన్న ప్రయత్నంలో భాగంగా ముంబయి పేరును వాడుకున్నారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి’ అని పవార్ విమర్శించారు. సవాడి వ్యాఖ్యలపై మహారాష్ట్ర భాజపా నాయకులు తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా నేతల వైఖరి తెలపాలి..