తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపే రామజన్మభూమి తీర్పు-నిఘా నీడన అయోధ్య - telugu political news

రేపు అయోధ్య కేసు తుదితీర్పు వెలువడనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. అత్యంత సున్నితమైన అంశం అయిన కారణంగా పరిస్థితిని పర్యవేక్షించేందుకు డ్రోన్లను రంగంలోకి దింపింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని మతాధికారులు, పూజారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

త్వరలో స్వతంత్ర భారత అతిపెద్ద కేసుతీర్పు-భద్రత సంసిద్ధం

By

Published : Nov 8, 2019, 10:30 PM IST

వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూమి కేసు తుదితీర్పు రేపు వెలువడనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్లను రంగంలోకి దింపింది.

అయోధ్యలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్రంలో సున్నితమైన జిల్లాల్లో బలగాల మోహరింపు పటిష్టంగా ఉందని శాంతి, భద్రతల అదనపు డీజీపీ పీవీ రామశాస్త్రి తెలిపారు. అయోధ్యలో ​గత రెండు నెలలుగా భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్​ఎస్​జీ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

మరింత రక్షణ కల్పించేందుకు ఏటీఎస్​ యూనిట్లు, బాంబు నిర్వీర్య బృందా​లు, విధ్వంసాన్ని అరికట్టేలా తక్షణ ప్రతిస్పందన బృందాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. నెల రోజుల నుంచి పోలీసులు.. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

భాగాలుగా విభజించి...

భద్రత దృష్ట్యా పట్టణాన్ని 31 భాగాలుగా, 35 ఉప భాగాలుగా విభజించి.. పర్యవేక్షణను కొనసాగిస్తున్నారు అధికారులు.

'హెలికాఫ్టర్లు సిద్ధం'

భద్రతా ఏర్పాట్లలో భాగంగా లఖ్​నవూ, అయోధ్యల్లో రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచినట్లు ఉత్తర్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు. పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్​ ఈ విషయాన్ని తెలియజేశారు.

విద్యాసంస్థల మూసివేత...

తీర్పు నేపథ్యంలో రేపటి నుంచి 11వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్​లోని అన్ని విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

'తీర్పును గౌరవించాలి'

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రజలంతా గౌరవించాలని వివిధ మతాలకు చెందిన పెద్దలు, పూజారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అయోధ్య అంశం భారత్​లో అత్యంత సున్నితమైనదని, కాబట్టి రానున్న కోర్టు తీర్పును గౌరవించి శాంతిని పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అంటూ లఖ్​నవూ ఈద్గా ఇమామ్​.. మౌలానా ఖాలీద్ రషీద్​ మహాలీ విశ్లేషించారు.

"స్వతంత్ర భారతంలో అయోధ్య కేసు అతిపెద్ద.. అత్యంత సున్నితమైన అంశం. కోర్టు తీర్పును గౌరవించి బాధ్యతగా వ్యవహరించడం ప్రతి పౌరుడి బాధ్యత."
-రషీద్ మహాలి, లఖ్​నవూ ఈద్గా ఇమామ్

ABOUT THE AUTHOR

...view details