మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ సంతాపం తెలిపారు. ఓ సహచరుడి కన్నా ఎక్కువగా వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా జీవితానికి వెలుపలా తమ ఇద్దరి మధ్య విలువైన జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. ఇద్దరం కలిసి భోజనం చేసిన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ తన మదిలో ఉంటాయని తెలిపారు.
నడ్డా
ముఖర్జీ మరణం పట్ల భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యంత శ్రద్ధతో దేశానికి సేవ చేశారని, పార్టీలకు అతీతంగా ఆయన ఆదరణీయుడని అన్నారు.
"మాజీ రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ మరణం విచారకరం. ఎన్నో పదవులను అలంకరించిన ఆయన.. అత్యంత శ్రద్ధ, సంకల్పంతో దేశానికి సేవలందించారు. ఆయన తెలివి, పట్టుదల.. పార్టీలకు అతీతంగా ఆదరించేలా చేసింది. ఆయన కుటుంబసభ్యులకు, అనుచరులకు నా సానుభూతి."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
శివరాజ్ సింగ్
ప్రణబ్ ముఖర్జీ మృతి వార్త తనకు బాధ కలిగించిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఓ పుత్రుడిని భరతమాత కోల్పోయిందని అన్నారు.