వ్యవసాయ రంగానికి సంబంధించి లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లుల వల్ల రైతులకు మంచే జరుగుతుందని కేంద్రం భరోసానిచ్చింది. ఈ బిల్లుల వల్ల రైతులకు తగిన ఆదాయం లభిస్తుందని.. వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుడులు, సాంకేతికత పెరుగుతాయని స్పష్టం చేసింది.
'ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) ఆర్డినెన్స్ 2020', 'ద ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైజ్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు, ద ఎస్సెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్లు'లను లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఈ నేపథ్యంలో.. దేశంలో 86శాతం మంది రైతులకు రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉందని.. వీరు కనీస మద్దతు ధరల(ఎమ్ఎస్పీ) నుంచి లబ్ధి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. కొత్త బిల్లులు చట్టాలుగా మారితే... అడ్డంకులు లేకుండా వ్యాపారం సాగుతుందని, తమకు నచ్చిన పెట్టుబడిదారులతో రైతులు సంప్రదింపులు జరపవచ్చని వెల్లడించారు
అదే సమయంలో ఎమ్ఎస్పీలు కొనసాగుతాయని సభకు మంత్రి హామీనిచ్చారు.