ఆసుపత్రిలోని అత్యవసర గది తాళం కనిపించకపోవడం వల్ల ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది...
ఉజ్జయిని జిల్లాలో 55 ఏళ్ల మహిళ అధిక రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో జిల్లా ఆసుపత్రిలో గురువారం రాత్రి చేరింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు కరోనా నిర్థారిత పరీక్షలు చేసే మాధవ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె రక్తనమూనాలు సేకరించి పరీక్షకు పంపారు.
ఆ తర్వాత ఆమెను ఆత్యాధునిక సదుపాయాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆర్డీ గార్డీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. తీరా అక్కడికి వెళ్లాక ఐసీయూకు సంబంధిన సిబ్బంది లేరు. మిగతావారికి ఆ గది తాళాలు కనిపించలేదు. అందుకే తాళాన్ని పగులగొట్టారు. అయితే అప్పటికే ఆ వృద్ధురాలు అంబులెన్స్‌లోనే మరణించింది.
బాధితురాలు ఆసుపత్రికి వచ్చినపుడు వెంటిలేటర్ ఏర్పాటు చేయకుండా అలసత్వం వహించిన ఇద్దరు సీనియర్ వైద్యులను విధుల నుంచి తొలగించి, ఘటనపై విచారణ చేపట్టినట్టు తెలిపారు ముఖ్య వైద్యాధికారి అనసూయ గ్వాలీ. చనిపోయిన మహిళ కరోనా పరీక్షలకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి:12 గంటల్లో 16 మరణాలు- 490 కేసులు