తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో రేపే బలపరీక్ష- సుప్రీంకోర్టు ఆదేశం - సుప్రీం ప్రతిపాదనను తిరస్కరించిన స్పీకర్​

MP political crisis
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం

By

Published : Mar 19, 2020, 1:56 PM IST

Updated : Mar 19, 2020, 9:20 PM IST

21:16 March 19

న్యాయసలహా తీసుకుంటాం...

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ బలపరీక్ష జరపాలన్న సుప్రీం నిర్ణయంపై స్పందించారు ముఖ్యమంత్రి కమల్​ నాథ్​. చట్ట ప్రకారం నడుచుకుంటామని.. బలపరీక్ష జరపాలా వద్దా అనే అంశంపై న్యాయ సలహా ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు కమల్​ నాాథ్​. 

మరో కాంగ్రెస్​ నేత పీసీ శర్మ... బలపరీక్ష నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు. రెబల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను అభ్యర్థిస్తామని పేర్కొన్నారు.  

19:23 March 19

మధ్యప్రదేశ్​ రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాసనసభలో శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్​ ఎన్​పీ ప్రజాపతిని ఆదేశించింది. బలపరీక్ష కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని స్పష్టం చేసింది.  

ఎమ్మెల్యేలను చేతులు పైకెత్తమని ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించింది సుప్రీంకోర్టు. అసెంబ్లీ సమావేశాలను వీడియోలో చిత్రీకరించాలని, వీలైతే ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.  

చట్ట ఉల్లంఘనలు జరగకుండా చూసే బాధ్యత అసెంబ్లీ కార్యదర్శికి అప్పజెప్పింది. కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 16 మంది విశ్వాస పరీక్షకు హాజరుకావాలని అనుకుంటే వారికి పూర్తి భద్రత కల్పించాలని మధ్యప్రదేశ్‌, కర్ణాటక డీజీపీలకు సుప్రీం సూచించింది.  

అంతకుముందు రెబల్​ ఎమ్మెల్యేలతో వీడియో లింక్​ ద్వారా మాట్లాడాలని మధ్యప్రదేశ్​ అసెంబ్లీ స్పీకర్ ఎన్​పీ ప్రజాపతికి సూచించగా.. ఆయన నిరాకరించారు. సుప్రీం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  

ఆనందంలో చౌహాన్​..

బలపరీక్షపై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత శివరాజ్​ సింగ్​ చౌహాన్​. కోర్టు తీర్పును ప్రశంసించారు. ప్రస్తుత ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని... బలపరీక్షలో సర్కారు పతనమవుతుందని వ్యాఖ్యానించారు.  

ముఖ్యమంత్రి కమల్​నాథ్​, దిగ్విజయ్​ సింగ్​ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు శివరాజ్​. ప్రస్తుత ప్రభుత్వం కూలిన అనంతరం.. తమకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు. 

18:16 March 19

మధ్యప్రదేశ్​ శాసనసభలో రేపు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

13:31 March 19

సుప్రీం ప్రతిపాదనను తిరస్కరించిన స్పీకర్​

మధ్యప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు... రెబల్​ ఎమ్మెల్యేలతో వీడియో లింక్​ ద్వారా మాట్లాడాలని మధ్యప్రదేశ్​ అసెంబ్లీ స్పీకర్ ఎన్​.పి.ప్రజాపతికి సూచించింది. శాసనసభ్యులు బందిఖానాలో ఉన్నారన్న భయాన్ని తగ్గించేందుకు కోర్టు ఒక పరిశీలకుడిని నియమిస్తుందని స్పష్టం చేసింది.

జస్టిస్ డీవై చంద్రచూడ్​, జస్టిస్ హేమంత్ గుప్తాల ద్విసభ్య ధర్మాసనం ఈ ప్రతిపాదనలు చేసింది. దీని వల్ల రెబల్​ శాసనసభ్యులు స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది.

"మేము బెంగళూరు లేదా మరో ప్రదేశానికి ఒక పరిశీలకుడిని పంపిస్తాం. ఫలితంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్పీకర్​ మాట్లాడడానికి వీలవుతుంది. అలా మాట్లాడిన తరువాత స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవచ్చు. "- ధర్మాసనం

అయితే సర్వోన్నత న్యాయస్థానం ప్రతిపాదనపై స్పీకర్​ ప్రజాపతి అభ్యంతరం వ్యక్తం చేశారు.  

రాజీనామాల సంగతేంటి?

తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని స్పీకర్ ప్రజాపతిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  

రాజ్యాంగ సంక్షోభానికి హేతువు

స్పీకర్​ ప్రజాపతి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎ.ఎమ్​. సింఘ్వీ... న్యాయస్థానాలు స్పీకర్​కు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభమైతే... అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని తెలిపారు.

గవర్నర్ లాల్జీ టాండన్ తరపున హాజరైన న్యాయవాది... ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఓ పక్కన కూర్చున్నారని, ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాలను స్పీకర్ ప్రజాపతి శాసిస్తున్నారని వాదించారు.

విశ్వాస పరీక్షను ప్రభావితం చేస్తుందా?  

ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయాల్లో స్పీకర్​ నిర్ణయం... విశ్వాస  పరీక్షను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా తెలిపాలని ధర్మాసనం అన్ని పార్టీలను ప్రశ్నించింది. రాజీనామా, అనర్హత విషయాలు స్పీకర్​ ముందు పెండింగ్​లో ఉన్నా.. విశ్వాస పరీక్ష నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకి లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  

Last Updated : Mar 19, 2020, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details