మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాసనసభలో శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ఎన్పీ ప్రజాపతిని ఆదేశించింది. బలపరీక్ష కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలను చేతులు పైకెత్తమని ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించింది సుప్రీంకోర్టు. అసెంబ్లీ సమావేశాలను వీడియోలో చిత్రీకరించాలని, వీలైతే ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
చట్ట ఉల్లంఘనలు జరగకుండా చూసే బాధ్యత అసెంబ్లీ కార్యదర్శికి అప్పజెప్పింది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 16 మంది విశ్వాస పరీక్షకు హాజరుకావాలని అనుకుంటే వారికి పూర్తి భద్రత కల్పించాలని మధ్యప్రదేశ్, కర్ణాటక డీజీపీలకు సుప్రీం సూచించింది.