కమల్నాథ్ బల పరీక్షపై సందిగ్ధత! మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం రసకందాయంలో పడింది. కమల్నాథ్ సర్కార్ బల పరీక్షపై సందిగ్ధత నెలకొంది. మరి విశ్వాస పరీక్షే జరిగితే... అధికార పీఠాన్ని కాంగ్రెస్ నిలుపుకోనుందా? విశ్వాసపరీక్షలో బలం నిరూపించుకోలేక అధికారాన్ని భాజపాకు చేజార్చుకుంటుందా అనేది నేటితో తేలిపోతుంది.
నేటి (మార్చి 16) నుంచి ఏప్రిల్ 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు తన ప్రసంగం పూర్తి అయిన వెంటనే విశ్వాస పరీక్ష ఉంటుందని గవర్నర్ లాల్జీ టాండన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే విశ్వాసపరీక్ష నిర్వహించాలా వద్దా అన్న దానిపై సోమవారమే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ప్రకటించడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపాలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాజీనామాల ఆమోదంతో..
22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను శనివారం ఆమోదించారు స్పీకర్ ప్రజాపతి. తాజా నిర్ణయంతో.. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 222కు పడిపోయింది. కమల్నాథ్ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత ప్రభుత్వానికి.. కాంగ్రెస్ 108, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేలతో కలిపి 114 మంది బలం ఉంది.
విప్లు జారీ..
అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. బడ్జెట్ సెషన్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది. భాజపా కూడా తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.
షాకు లేఖ..
సోమవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెంగళూరులో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరయ్యేలా భరోసా కల్పించాలని కోరుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు శనివారం లేఖ రాశారు ముఖ్యమంత్రి కమల్నాథ్. వారంతా ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపారు.
సింధియాతో సంక్షోభం..
మధ్యప్రదేశ్లో కీలక నేత జోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఆయన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులను వదులుకోవటం వల్ల సంక్షోభం నెలకొంది. వీరంతా భాజపాలో చేరతారని అందరు అనుకున్నప్పటికీ.. సింధియా ఒక్కరే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సందిగ్ధత నెలకొంది.
బెంగళూరులోని ఓ రిసార్ట్లో ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో కొందరు భాజపాలో చేరేందుకు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. తిరిగి పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తాజాగా ఆరుగురి రాజీనామాలను స్పీకర్ ఆమోదించగా.. మిగతా 16 మంది రాజీనామాలపై ఉత్కంఠ నెలకొంది.
16 మంది రాజీనామాలు ఆమోదిస్తే..
22 మంది రెబల్ ఎమ్మెల్యేల్లో మిగతా 16 మంది రాజీనామాలు ఆమోదిస్తే.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206కు పడిపోతుంది. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 104కు చేరుతుంది. కాంగ్రెస్ బలం 92కు చేరుకోవటం వల్ల మెజారిటీకి 5 సీట్ల దూరంలో నిలిచిపోతుంది అధికార కూటమి. దీంతో భాజపాకు ఉన్న 107 స్థానాలతో అధికారం పీఠం దక్కించుకుంటుంది.
అయితే.. తమ ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. విశ్వాస పరీక్షలో నెగ్గితీరుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్న మాటల్లో నిజం ఎంతుందనేది రేపటితో తేలిపోనుంది.
బలపరీక్షపై స్పీకర్ ఏమన్నారంటే?
వివిధ మాధ్యమాల ద్వారా రాజీనామాలు పంపించిన ఎమ్మెల్యేల కోసం ఎదురుచూస్తున్నానని, వారు ఎందుకు రాజీనామాలు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి. అసెంబ్లీలోని సభ్యులకు ఏమి అయిందనే విషయంపై ఆందోళన చెందుతున్నానన్నారు. ప్రస్తుత పరిస్థితులు ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని స్పీకర్ అభిప్రాయపడ్డారు.
సోమవారం (ఇవాళ) బలపరీక్ష జరుగనుందా అనే అంశంపై అడిగిన ప్రశ్నకు దాటవేసే సమాధానమిచ్చారు స్పీకర్. తాను తీసుకోబోయే నిర్ణయం ముందుగానే వెల్లడించాల్సిన అవసరం లేదన్నారు.
ఇదీ చూడండి:భారత్లో 112కు చేరిన కరోనా కేసులు!