కొన్నేళ్లపాటు పైసా పైసా కూడబెట్టి.. పాఠశాల నిర్మాణానికి విరాళమిచ్చింది డిగ్లో బాయి అనే వృద్ధురాలు. చిన్నతనంలో బడికే వెళ్లని ఆమె.. ఎదిగిన తర్వాత ఎంతోమంది అక్షరాలు నేర్చుకునేందుకు తోడ్పాటునందించింది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న డిగ్లో.. పాఠశాలకు వచ్చే చిన్నారుల్లోనే అన్ని బంధాలను చూసుకుంటోంది.
మధ్యప్రదేశ్ మండ్లా జిల్లాలోని పద్మి గ్రామానికి చెందిన డిగ్లో బాయిది నిరుపేద కుటుంబం. పేదరికం వల్ల ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు పంపలేదు. ఈ క్రమంలో చదువు ఎంత విలువైందో తెలుసుకుంది డిగ్లో.
రూ. లక్ష విరాళం..
కూడబెట్టిన రూ. లక్ష నగదును తన గ్రామంలోని పాఠశాల గది నిర్మాణానికి విరాళంగా అందించింది. ఇందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మింది డిగ్లో. రెక్కాడితేగాని డొక్కాడని ఆమె ఇంత మొత్తం పాఠశాల భవనానికి ఇవ్వడాన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు.