ఇప్పటి వరకు మనం ప్రేమ పెళ్లిళ్ల గురించి విని ఉంటాం. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లను చూసి ఉంటాం. ఎవరైనా ప్రేమ పెళ్లి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని, పెద్దలు చూసిన అమ్మాయినీ పెళ్లి చేసుకున్నాడు. అదీ ఒకే వేదికపై! ఒకే ముహూర్తానికి!! వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని కెరియా గ్రామంలో జరిగింది.
ఒకటే వేదిక.. వరుడొక్కడు.. వధువులిద్దరు! - ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్న ఎంపీ వాసి
ఒకే వేదికపై, ఒకే ముహూర్తానికి ఒకే వ్యక్తి.. ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని కెరియా గ్రామంలో జరిగింది. వీరిలో ఒకరు ప్రేమించిన అమ్మాయి కాగా, మరొకరు పెద్దలు కుదిర్చిన వధువు. ఈ వివాహానికి మూడు కుటుంబాలూ అంగీకరించడం గమనార్హం.
గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తికి పక్క గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఇదే విషయాన్ని సందీప్‌కు తెలియజేయగా.. భోపాల్‌లో చదువుకునే సమయంలో తాను మరో అమ్మాయిని ప్రేమించానని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో ఏం చేయాలో తెలియని కుటుంబసభ్యులు స్థానిక పంచాయతీ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీలో పెద్దలు సందీప్‌తో కలిసి జీవించేందుకు ఇద్దరు అమ్మాయిలకు ఇష్టమైతే పెళ్లి జరిపించవచ్చని చెప్పారు. దీనికి మూడు కుటుంబాలూ అంగీకరించాయి. ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి కూడా సందీప్‌ను వివాహం చేసుకునేందుకు అంగీకరించడం కొసమెరుపు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ప్రభుత్వ అధికారుల దృష్టికి రావడంతో దీనిపై విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి:పాక్ లాంచ్పాడ్లపై ఉగ్ర ఆక్రమణ