మధ్యప్రదేశ్‌లో భాజపా నేతలు గవర్నర్ లాల్జీ టాండన్‌ను కలిశారు. మార్చి 16లోగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను కోరారు. మూజువాణి ఓటుతో కాకుండా ఓటింగ్(డివిజన్ ఆఫ్ ఓట్) ద్వారా బలపరీక్ష నిర్వహించాలని విన్నవించారు. ఈ మేరకు భాజపా నేతలు గోపాల్ భార్గవ, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా, భూపేంద్ర సింగ్‌లు కలిసి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.
"గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించాం. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాను వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్యేలు ధ్రువీకరించారు. కమలనాథ్ ప్రభుత్వం ఇప్పుడు మైనారీటీలో ఉంది. రాజ్యాంగబద్ధంగా వారి ప్రభుత్వం కొనసాగే హక్కు లేదు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి అర్థం లేదు. అందుకే బడ్జెట్ సమావేశాలకు ముందే బలపరీక్ష నిర్వహించాలి."-శివరాజ్‌సింగ్ చౌహాన్, భాజపా నేత
గవర్నర్ నియమించిన అధికారి పర్యవేక్షణలో విశ్వాస పరీక్ష జరగాలని చౌహాన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పూర్తిగా వీడియోలో చిత్రీకరించేలా ఆదేశించాలని గవర్నర్‌ను అభ్యర్థించారు. బడ్జెట్ సమావేశానికి ఒకరోజు ముందుగా(ఆదివారం రోజు)నే ఈ బల పరీక్ష నిర్వహించాలన్నారు.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు చౌహాన్. శాసనసభ్యులపై కేసులు పెడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు కేంద్ర బలగాల భద్రత కోరుతున్నారని, భద్రత లేనిదే బెంగళూరు నుంచి తిరిగి రారని స్పష్టం చేశారు.