లాక్డౌన్లో చిక్కుకున్న వలస కార్మికుల కష్టాలను తీర్చిన సోనూసూద్ పేరు ఇప్పడు దేశవ్యాప్తంగా సుపరిచితమే. వలస జీవులు స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సుల ఏర్పాటు చేశాడు. తనకు సాయం చేయమని కోరిన వారందిరకీ.. కాదనకుండా చేయూతనిచ్చాడు. అయితే.. ఓ భాజపా సీనియర్ నేత, రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే సోనూ సాయం కోరారు. ఆయనకి ఒక యాక్టర్ సహాయం ఎందుకు అవసరమైందో తెలుసుకుందాం..
భాజపా నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, ప్రస్తుతం రేవా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా.. సోనూసూద్ సహాయం కోరారు. ముంబయిలో చిక్కుకుపోయిన తన ప్రాంత వలస కార్మికులు స్వస్థలానికి చేరేలా చూడాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ముంబయిలో చిక్కుకున్న మధ్యప్రదేశ్‌లోని రేవా, సాంట్నా జిల్లాలకు చెందిన 168 మంది వలస కార్మికుల జాబితాను ఈ ట్వీట్‌కు జత చేశారు శుక్లా.
సానుకూల స్పందన..
భాజపా నేత వినతికి సానుకూలంగా స్పందిచాడు సోనూసూద్. 'మీ ప్రాంత వలస కార్మికులను రేపు స్వస్థలానికి పంపుతాను. ఈసారి ఎప్పుడైనా నేను మధ్యప్రదేశ్ వస్తే.. పోహా తినిపించండి' అంటూ ట్వీట్ చేశాడు.
ఆ తర్వాత తన విజ్ఞప్తికి సోనూ సానుకూలంగా స్పందించారని.. 168 మందిలో 55 మంది మధ్యప్రదేశ్ చేరుకుంటారని తెలిపారు భాజపా నేత.