భారతావని బహుభాషల పురుటి గడ్డ. సమున్నత భాషా సంస్కారాలతో విభిన్నమై, విలక్షణమై వెలుగొందుతున్న సముజ్జ్వల ధాత్రి! భాషా, సంస్కృతులపరంగా ఊడలు దిగిన అసాధారణ బహుళత్వమే దేశానికి పెట్టనికోటగా నిలుస్తోంది. విభిన్న భాషలు, సంస్కృతుల మధ్య ముడివడిన అపూర్వ స్నేహశీలత, సమన్వయాలే భారతావనిని బహుళవర్ణశోభితంగా తీర్చిదిద్దుతున్నాయి. దేశానికి సిసలైన బలమై నిలుస్తున్నాయి. జాతిని విశిష్ట వేదికపై నిలుపుతున్నాయి.
అయితే మూలాలతో బంధానికి చెరగని గురుతులైన మాతృభాషల పరిరక్షణకు మనం అవసరమైన స్థాయిలో కృషి చేయడం లేదన్న వాస్తవం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. బోధన మాధ్యమానికి సంబంధించి మరీ ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయుల్లో విద్యను ఏ భాషలో నేర్పించాలన్న విషయమై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. పిల్లల సృజనాత్మక వ్యక్తీకరణకు అమ్మభాష తిరుగులేని ఆదరవుగా ఉపయోగపడుతుంది.
నాగరికతకు ప్రాతిపదిక
మానవ పరిణామంతోపాటే భాషా సంస్కృతులూ ఎప్పటికప్పుడు కొత్త చివుర్లు తొడుగుతుంటాయి. నిరంతర సాధన, వాడకం ద్వారానే భాషా సౌష్టవం పదునుతేలుతుంది. చరిత్ర, సంస్కృతి పరిణామక్రమంలో; సామాజిక వికసన క్రమంలో స్థానిక భాషలు పోషించే పాత్ర అనన్య సామాన్యమైనది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా శాఖోపశాఖలై విస్తరించిన అమ్మభాషలు- సమాజ జీవన గమనంతో ముడివడిన ప్రతి చిన్న విషయాన్నీ ప్రభావితం చేస్తూ, భారతీయ నాగరికతకు ప్రాతిపదికలై విలసిల్లుతున్నాయి. మన వ్యక్తిగత, సామూహిక అస్తిత్వంతోపాటు సంస్కృతీ సంప్రదాయాలకు అమ్మ భాషలు ప్రాణవాయువులు.
ప్రజల మధ్య దృఢమైన అనుబంధాలను స్థిరపరచడంలో మూల భాషలది ముఖ్యమైన పాత్ర అనడంలో మరో మాట లేదు. భాషా గణన ప్రకారం భారతావనిలో 19,500 రకాల భాషలు, మాండలికాలు వాడుకలో ఉన్నాయి. దేశంలో పది వేలమంది కంటే అధికంగా మాట్లాడుతున్న భాషల సంఖ్య 121. భాషకు జడత్వం లేదు. నిరంతర గతిశీలత దాని స్వభావం. చుట్టూ మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా భాషలు పరిణతి చెందుతుంటాయి. ఆ క్రమంలో భాషలు విస్తరిస్తాయి, కుంచించుకుపోతాయి, రూపాంతరీకరణ చెందుతాయి, ఇతర భాషా సమూహాల్లో విలీనమవుతాయి, దురదృష్టవశాత్తూ కొన్ని సందర్భాల్లో అవి అంతర్ధానమూ అవుతుంటాయి. ‘భాషలు వికసించి, ఆ వెలుగులు చుట్టూ విస్తరించకపోతే మనం ఇప్పటికీ చిమ్మచీకట్లలోనే తచ్చాడుతూ ఉండేవాళ్ల’మని విఖ్యాత సాహితీవేత్త ఆచార్య దండి చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
దేశంలో ప్రస్తుతం 196 భాషలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయన్న వార్తలు తీవ్రమైన ఆవేదన కలిగిస్తున్నాయి. ఈ సంఖ్య ఇంతకుమించి పెరగకుండా మనం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఏ భాషనైనా నిరంతరం ఉపయోగించడం ద్వారానే వాటిని మలిగిపోకుండా కాపాడుకోగలం.
సుజ్ఞాన భాండాగారాలైన భారతీయ భాషా వారసత్వాలను కాపాడుకోవాల్సిన, పదిలపరచుకోవాల్సిన అవసరాన్ని నేను ఎప్పుడూ నొక్కి చెబుతుంటాను. జాతి నాగరికతా ప్రస్థానంలో ఘన వారసత్వంగా దఖలుపడిన విజ్ఞాన నిధులను మనం ఎట్టిపరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదు. అమ్మ భాషలను నిర్లక్ష్యం చేస్తే మన అస్తిత్వ మూలాలతో సంబంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక భాష నశిస్తే దానితోపాటు తరాలుగా భుజం కలిపి నడిచిన విజ్ఞానసిరులు, విలక్షణ ప్రాపంచిక దృక్పథం వంటివన్నీ అంతర్ధానమవుతాయి. ఒక భాష అంతరించిందంటే దానితోపాటు ఆ సమూహ మనుగడకు మూలాధారమైన జీవన నైపుణ్యాలు, కళారీతులు, విలక్షణ వాణిజ్య విధానాలు, వంటలు తదితర వారసత్వ సంపదలన్నీ మటుమాయమవుతాయి.
భాషా పరిరక్షణకు, అభివృద్ధికి విభిన్న మార్గాల్లో ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది. మన పాఠశాలల్లో ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలి. బుడి బుడి అడుగుల దశలోనే పిల్లలకు అమ్మ భాషలో అక్షరాలు నేర్పితే వారిలో మేధా వికాసం, సృజనాత్మకత, తర్కజ్ఞానం విస్తరిస్తాయని ప్రపంచవ్యాప్తంగా వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ‘ప్రపంచమంతటా విస్తరించిన అమ్మ భాషల గురించి అందరికీ తెలియాలని, ప్రతి భాషకూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, ప్రజా జీవనంతో ముడివడిన ప్రతి విషయంలోనూ మూల భాషలకు విస్తృత ప్రాముఖ్యం దక్కాలని ‘యునెస్కో’ భావిస్తోంది. కానీ, అలా జరగడం లేదు. వివిధ మాతృభాషలకు జాతీయ భాష హోదాగాని, అధికార భాష హోదాగాని లేదా బోధన మాధ్యమ గుర్తింపుగాని ఉండటం లేదు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అది దీర్ఘకాలంలో అమ్మ భాషలు అంతరించిపోవడానికే కారణమవుతుంది’- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (2019, ఫిబ్రవరి 21) సందర్భంగా ‘యునెస్కో’ డైరెక్టర్ జనరల్ అడ్రే అజౌలే వెలువరించిన ఈ వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఉరుముతోంది. ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉంటే చాలు ఆధునిక ప్రపంచంలో వాయువేగంతో దూసుకుపోగలమన్న, అవకాశాలను ఒడిసిపట్టగలమన్న దురభిప్రాయం సర్వత్రా ప్రబలుతోంది. ప్రపంచంలో ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికా వంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఆంగ్ల మాధ్యమం వాడుకలో ఉంది. చైనా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా వంటి అనేక దేశాలు ఆంగ్ల విద్యావిధానంతో సంబంధం లేకుండానే అద్భుతమైన పురోగతిని సాధ్యం చేసి చూపాయి. అంతర్జాతీయ భాషల్లో ఆంగ్లమూ ఒకటి. ఆ భాషపై అవగాహన, పరిజ్ఞానం కలిగి ఉండటం మంచిదే! దాన్నెవరూ తప్పుపట్టరు. అయితే కొందరు ప్రవచిస్తున్నట్లు అమ్మభాషను తొలగించి ఆ స్థానంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడం మాత్రం సరికాదు.