తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యా వ్యవస్థలో భాష మారితే.. మేధ పెరుగుతుందా? - విద్యా వ్యవస్థలో భాష మారితే.. మేధ పెరిగుతుందా?

రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బలంగా వేళ్లూనుకుంటోంది. ఆంగ్లంలో  చదివితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్న భావనలే  ఈ పరిణామానికి కారణం. అసలు ఆంగ్ల మాధ్యమానికి, మేధా వికాసానికి సంబంధం లేదంటూ ఆ వాదనలోని నిజానిజాలను విశ్లేషిస్తున్న వ్యాసమిది..

mother tongue in education an eenadu essay on changuging education system
విద్యా వ్యవస్థలో భాష మారితే.. మేధ పెరిగుతుందా?

By

Published : Dec 8, 2019, 7:46 AM IST

Updated : Dec 8, 2019, 8:04 AM IST

నేర్చుకునే భాష మారితే విద్యార్థుల తలరాతలు మారిపోతాయనే విచిత్రవాదన ఇటీవలి కాలంలో ఊపందుకుంటోంది. ప్రకృతి, సామాజిక విజ్ఞానాలకు సంబంధించిన మౌలిక భావనలను హృదయాలకు హత్తుకునేలా చెప్పడంలో వైఫల్యం గురించి పెద్దగా మాట్లాడటం లేదు.

ఈ వైఫల్యం విద్యార్థి మేధను దారుణంగా మొద్దుబార్చుతున్నా దాన్నొక భాషా వైఫల్యంగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాతృభాషకు బదులు ఆంగ్లంలో పాఠాలు బోధిస్తే ఈ వైఫల్యం దానంతటదే కనుమరుగైపోయి, భవిష్యత్తు బంగారమవుతుందన్న భ్రమను కల్పించడం విపరిణామాలకు దారితీస్తుంది.

మన భావ, జ్ఞాన దారిద్య్రానికి మాతృభాషలో చదవడం కారణమనే సిద్ధాంతాన్ని నిజమని నమ్మి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బోధనను ఆంగ్లంలోకి మార్చివేస్తే, విజ్ఞానంతో తొణికిసలాడే నవతరం తయారవుతుందని ప్రచారం చేసే వాళ్లు చరిత్ర చెప్పిన కీలక విషయాలను మరచిపోతున్నారు.

బ్రిటన్​ భాషకు బానిసలమా?

ఆంగ్లాన్ని బాగా నేర్చుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయనే ఆశ ఎప్పటినుంచో మన సమాజంలో పాతుకుపోయింది. బ్రిటీషు పాలనలో పరిపాలనంతా ప్రధానంగా ఆంగ్లంలో సాగడం వల్ల అది వచ్చినవాళ్లకే ఉద్యోగాలు దక్కేవి. బ్రిటన్‌ నుంచి తెల్లవారిని తీసుకువచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో నియమించడం ఆర్థికంగా భారం కాబట్టి భారతీయులకే ఆంగ్లం నేర్పితే తక్కువ జీతాలతో సరిపెట్టొచ్చని వలస పాలకులు భావించారు.

ఆ ఆర్థిక కోణంతోపాటు మరో అంశమూ ఆంగ్లంలో చదువులను ప్రవేశపెట్టడంలో ఉంది. ప్రపంచంలోని అన్ని భాషలకన్నా ఆంగ్లమే గొప్పదని ఆనాటి పాలకులు నమ్మారు. అంతకంటే ముఖ్యంగా ఆ భాషలో చదువు చెబితే బ్రిటన్‌ పట్ల విధేయత కలిగిన కొత్త వర్గం పుట్టుకొస్తుందని భావించారు.

దేశంలో ఆంగ్ల విద్యకు ఆద్యుడిగా చెప్పుకొనే మెకాలే దాని గురించి చాలా నిర్మొహమాటంగానే వివరించారు. ఆంగ్లం నేర్చుకున్న భారతీయులు రంగూరూపంలో మాత్రమే భారతీయులుగా ఉంటారని, ఆలోచనల్లో బ్రిటన్‌ మానసపుత్రులుగా మారి తమకు విధేయులై ఉంటారన్న ఆయన వ్యాఖ్యలను చరిత్రకారులు ఇప్పటికీ ఉటంకిస్తూనే ఉంటారు.

మన భాషే లెస్స!

ఎంత ప్రయత్నించినా ఆంగ్ల భాషలో విద్యను బోధించడం ద్వారా బ్రిటీషు పాలకులు ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. ఆంగ్లం ద్వారా ఆధునిక దేశాల చరిత్ర, అక్కడ పాదుకున్న ప్రజాస్వామ్యాన్ని తెలుసుకుని మన దేశంలో అలాంటి పాలన కావాలని స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రారంభించి, చివరికి బ్రిటీషువారిని సాగనంపాం. మెకాలే లెక్క మొదట్లో పనిచేసినా చివరికి గురి తప్పింది.

బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఉత్తేజితులను చేయడానికి మన నాయకులకు ఆ భాష పెద్దగా పనికిరాలేదు. ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి ఆ ప్రజలు మాట్లాడుకునే భాషలవైపే చూశారు. ఆధునిక భావాలను, దేశదేశాల అనుభవాలను, పోరాటాలను దేశ భాషల్లో అనేక రూపాల్లో వ్యక్తంచేయడానికి ఆనాడు మహాయజ్ఞమే జరిగింది.

మాతృ భాష అడ్డంకి కాదు

1900 నుంచి 1950 వరకూ దేశ భాషలన్నీ కొత్త భావాలతో కనీవినీ ఎరగని రీతిలో సుసంపన్నమయ్యాయి. ఆ భావ సుసంపన్నత నుంచే జాతీయోద్యమం బలపడింది. అనేక నాగరికతల్లోని మంచి భావాలను మన భాషల్లోనే మహత్తరంగా చెప్పుకోవడంతో మన మేధా వైశాల్యం ఎంతో పెరిగింది.

ఏదో సాధించాలన్న తపన, దేశదేశాల్లోని ఔన్నత్యానికి దీటుగా ఎదగాలన్న ఆకాంక్ష- విజ్ఞానంలో ఎన్నోమెట్లు పైకి ఎక్కడానికి దోహదపడింది. విజ్ఞాన శాస్త్రాల్లో ముందుకు దూసుకెళ్లిన భారతీయులందరూ ఆ రకంగా స్ఫూర్తి పొందినవారే. అంతెందుకు 1960, 1970ల్లో పాశ్చాత్య దేశాలకు వెళ్లినవారిలో కనీసం పాఠశాల వరకైనా మాతృభాషల్లో చదివినవారే ఎక్కువ. మాతృభాషలో చదవడం వారి పురోగతికి ఎలాంటి అడ్డంకీ కాలేదు.

బదులులేని ప్రశ్నలు

ఏడోతరగతి పిల్లలు మూడోతరగతి లెక్కలను సరిగ్గా చేయలేని దుస్థితి, ఆంగ్లంలో వాటిని బోధిస్తే తొలగిపోతుందా? మాతృభాషలో సైతం తప్పుల్లేకుండా రాయలేకపోవడానికి ఆంగ్ల మాధ్యమంలోకి మారడం ఒక పరిష్కారమా? పోనీ ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలు ఆ భాషలో తప్పుల్లేకుండా వాక్య నిర్మాణం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారా?ఆంగ్ల మాధ్యమంలో ఇంజినీరింగు పూర్తిచేసి ఏటా లక్షల సంఖ్యలో విద్యాసంస్థల నుంచి వస్తున్నవారిలో సరైన భావవ్యక్తీకరణ ఉన్నవారు 15 శాతానికి ఎందుకు మించడం లేదు? ఇది భాషావైఫల్యమా, లేక విద్యా వైఫల్యమా? విద్యా వైఫల్యంగా దీన్ని ఒప్పుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు.

అలా అంగీకరిస్తే విద్యావ్యవస్థను సమూలంగా సంస్కరించే చర్యలను చేపట్టాలి. విద్యారంగంపైన చేసే ఖర్చు మూడునాలుగొంతులు పెంచాల్సి వస్తుంది. ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠాలు చెప్పే విధంగా కఠిన నిబంధనలు రూపొదించాల్సి వస్తుంది. ప్రజలు మాట్లాడుకునే భాషలోకి పెద్దయెత్తున ఆధునిక విజ్ఞానాన్ని తీసుకురావాల్సి వస్తుంది. ఇవేమీ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. విద్యా బోధనను ఆంగ్లంలోకి మార్చివేస్తే అన్ని సర్దుకుంటాయన్న ఆలోచనవల్ల విద్యార్థుల పరిస్థితి ఇంకా దిగజారుతుంది. నేడు ఆర్థికంగా అగ్రగామిగా ఉన్న దేశాలేవీ తమ మాతృభాషలు ఆధునిక అవసరాలకు సరిపోవని ఏనాడూ భావించలేదు.

అవసరమైతే అనువదించాలి

ఇతర భాషల్లో మంచి రచన ఉంటే దాన్ని తమ సొంత భాషల్లోకి అనువదించుకోవడానికి అక్కడ ఏళ్లూపూళ్లూ పట్టవు. రోజులు, నెలల్లోనే ఆపని జరిగిపోతుంది. అనువాద పరిశ్రమ అక్కడ అంతగా వ్యవస్థీకృతమైంది. విజ్ఞానశాస్త్రాలకు సంబంధించిన అన్ని పుస్తకాలు అక్కడ అనువాదం అవుతాయి. జపాన్‌ ఎన్నడూ వలస పాలన కిందలేదు. ఆంగ్ల భాషతో వాళ్లకు ఏ రకమైన సంబంధం లేదు. అయినా ఐరోపా దేశాల విజ్ఞానాన్ని తమ భాషలోకి తెచ్చుకున్నారు.

దిగుమతి చేసుకున్న పరికరాలను విడదీసి అవెలా తయారయ్యాయో పరిశీలించారు. కిందామీదా పడి ఒక్కొక్క పరికరాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయగలిగారు. ఆ క్రమంలో తాము తెలుసుకున్న జ్ఞానాన్ని తమ భాషలో క్రమపద్ధతిలో రాసుకున్నారు. అవసరమైన పదజాలాన్ని సృష్టించుకున్నారు. ఏళ్ల కృషివల్ల ఇదంతా సాధ్యపడింది.

ప్రయోగాలతో పాటు భాషా సుసంపన్నమైంది. భాషా సుసంపన్నం అనేది జ్ఞానంతో సంబంధంలేకుండా ఎదగదు. ప్రయోగశీల విజ్ఞానాన్ని పక్కనబెట్టి లోపమంతా మన భాషలోనే ఉందని భావించడం ఎంత తప్పో జపాన్‌ అనుభవాన్ని చూస్తే అర్థమవుతుంది. భాష వల్ల ఆర్థిక పరిస్థితి దానంతటదే మెరుగుపడుతుందనీ చెప్పలేం. అమెరికాలో నల్లజాతీయులు ఎప్పటి నుంచో ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు. అదే మాధ్యమంలో చదువుతారు. కానీ అక్కడ ఇప్పటికీ తెల్లవారితో పోల్చితే నల్లజాతి వారిలో ఎంత వెనకబాటుతనం ఉందో అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కనీస పౌర హక్కుల కోసం నల్లజాతీయులు అక్కడ 1960ల్లో పెద్ద పోరాటమే చేయవల్సి వచ్చింది. సమాన అవకాశాలనేవి విధానాల మీద ఆధారపడి ఉంటాయి.

సంక్షోభం భాషది కాదు..

విద్యారంగ సంక్షోభాన్ని ఏ కోణం నుంచి చూసినా అది భాషాపరమైన సమస్య కానేకాదని అర్థమవుతుంది. ఇప్పుడున్న తీరులో ఆంగ్లంలో బోధించినా తెలుగులో బోధించినా దక్కే ఫలితంలో తేడా ఎంతమాత్రం ఉండదు. ఆర్థికంగా సంపన్న స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లలు ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో చదువుకుంటున్నారని, ఆ కుటుంబాలకు చెందిన నోరుగలిగినవారే తెలుగుభాష గురించి గగ్గోలు పెడుతున్నారని విమర్శలు చేయడం- అసలు సమస్య నుంచి దృష్టిని మళ్లించడమే అవుతుంది. తెలుగులో కానీ, ఇతర భారతీయ భాషల్లోకానీ ఆధునిక విజ్ఞానాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చిన వ్యక్తులు సంపన్న వర్గాలకు చెందినవారు కానేకాదు.

తెలుగువారి కోసం వందేళ్ల క్రితమే విజ్ఞాన సర్వస్వాలను తయారుచేసిన కొమర్రాజు లక్ష్మణరావు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఎన్నో వైజ్ఞానిక విషయాలను తేలికైన భాషలో అద్భుతంగా రాసిన కొడవటిగంటి కుటుంబరావు సంపన్న కుటుంబం నుంచి రాలేదు.

తెలుగులో ప్రాకృతిక, సామాజిక, వైద్య, తాత్విక, సాహిత్య విజ్ఞానాన్ని తేటతెలుగులో రాసినవారందరూ సంపన్న వర్గాలవారు కారు. సమభావం, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులమీద సమాజం ఏర్పడాలని ఆకాంక్షించి, అందుకోసం జీవిత శక్తులన్నీ ధారపోసి గొప్ప రచనలు చేసినవారెవరూ ధనిక వర్గం నుంచి రాలేదు. వాళ్లను నడిపించింది సమాజ హితం కోరే విశాల దృక్పథమే!

దుస్థితి మారాలంటే..

విద్యాపరంగా మనం ఎదుర్కొంటున్న దుస్థితి ఒక భాష నుంచి ఇంకో భాషకు మారడం వల్ల సమసిపోయే చిన్న విషయం కాదు. ఆంగ్ల భాషను ఒక పాఠ్యాంశంగా ఒకటి నుంచి పదో తరగతి వరకూ సరిగ్గా ఆధునిక పద్ధతుల్లో చెబితే అందులో మాట్లాడటం, రాయడం కచ్చితంగా వస్తుంది. భావవ్యక్తీకరణకు మాతృభాషను కూడా సరిగ్గా ఉపయోగించడం నేర్పలేని వైఫల్యం- విద్యావ్యవస్థదేగాని, ఆ భాషది కాదు. అది ప్రభుత్వాల ఘోర వైఫల్యం. మనం నిత్యం ఉపయోగించే తెలుగు వాక్య నిర్మాణాన్ని, దాని వెనక ఉన్న వ్యాకరణ సూత్రాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే అనేక విజయాలు సాధించవచ్చు.

ఒక భాషా నియమాలను అర్థం చేసుకుంటే మరో భాషను నేర్చుకోవడం కష్టం కాదు. సొంత భాష విషయంలోనే విద్యార్థులను ఈ స్థాయికి చేర్చలేని మన విద్యావ్యవస్థ- ఆంగ్లంలో బోధనను నెత్తినపెట్టుకుని అద్భుతాలు చేస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గానీ రేపు మరో రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆంగ్ల మాధ్యమంలోనే పాఠశాల విద్యను బోధిస్తామని చెప్పినంత మాత్రాన విద్యార్థులకు ఒరిగేదేమీ ఉండదు.

విషయ పరిజ్ఞానాన్ని, విమర్శనాత్మక దృక్పథాన్ని, వివేచనా శక్తిని కలగచేయకుండా ఆంగ్లంలో పరీక్షలు పెట్టి ఉత్తీర్ణులను చేసినంత మాత్రాన ఎవరూ పిలిచి ఉద్యోగాలు ఇవ్వరు. భ్రష్టత్వం తెలుగులోనైనా ఆంగ్లంలోనైనా ఒక్కటే! అన్ని రాష్ట్రాలు కొంచెం అటూఇటూగా అయినా ఆంగ్ల మాధ్యమంలోనే బోధించడానికి నిర్ణయం తీసుకుంటే సొంతభాషలో విజ్ఞానాన్ని వృద్ధిచేసుకోలేని విఫల దేశంగా మాత్రం మనం ఘనమైన గుర్తింపు తెచ్చుకుంటాం. శతాబ్దాల చరిత్ర ఉండి, ఘనమైన సాహిత్యమున్న మన భాషలకు ఆ దుస్థితి రాకూడదని కోరుకుందాం!

-ఎన్​. రాహుల్​ కుమార్

ఇదీ చదవండి:ఆకాశంలో సగం: పురుషులతో 'అపూర్వ' దంగల్

Last Updated : Dec 8, 2019, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details