బిడ్డకు కిడ్నీ ఇచ్చేందుకు తల్లి అంగీకారం.. కానీ చట్టం..! కుమారుడుకి జ్వరం వస్తేనే తల్లడిల్లిపోతుంది తల్లి. అలాంటిది రెండు కిడ్నీలు పాడైపోయిన కుమారుడి బాధను చూసి విలవిల్లాడింది కర్ణాటక మైసూర్‌కు చెందిన లక్ష్మమ్మ. కిడ్నీ ఇచ్చేందుకు తాను ముందుకొచ్చినా.. చట్టపరమైన ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ కుమారుడికి కిడ్నీ మార్పిడి చేయించలేకపోతున్నందుకు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అమ్మ ఇస్తానంది కానీ..
మైసూర్ తాలూకా దసనకొప్పలు గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మమ్మల చిన్న కొడుకు వినయ్. అతని రెండు కిడ్నీల సమస్యతో మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కిడ్నీ ఇచ్చేందుకు 60 ఏళ్ల లక్ష్మమ్మ అంగీకరించింది.
కానీ, కిడ్నీ ఇచ్చే ముందు కొన్ని చట్టపరమైన విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో కుటుంబ సభ్యుల సమ్మతితో జనన ధ్రువీకరణ పత్రం, సరైన పుట్టిన తేదీలు జతచేయాల్సి ఉంటుంది. అయితే.. వినయ్‌కు తప్పా.. తన సోదరులిద్దరికీ జనన ధ్రువీకరణ పత్రాలున్నాయి. ఇప్పుడు వినయ్ జనన ధృవీకరణ పత్రాన్ని పొందాలంటే కోర్టు ఆమోదించాలి.
చేసేదేమీ లేక లక్ష్మమ్మ కుటుంబం వినయ్ జనన ధృవీకరణ పత్రం కోసం స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేసిన వారికి ఈ కోర్టు ఛార్జీలు అదనపు భారంగా మారాయి. వినయ్ ఆర్థిక సమస్యల కారణంగా భార్యా బిడ్డలను అత్తారింటికి పంపించేశాడు. ఓ వైపు పుత్రుడి ఆరోగ్యం క్షీణించి.. మరోవైపు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చిదిమేస్తున్నందున గుండెలు పగిలేలా రోదిస్తోంది లక్ష్మమ్మ.
ఇదీ చదవండి:'కంబళ వీరుడు' శ్రీనివాస గౌడకు సీఎం సత్కారం