ఈసారి ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్లో బాబా కేదార్ యాత్ర ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ యాత్ర భక్తులకు మాత్రమే కాదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, చిన్నా పెద్ద వ్యాపారాలకూ మేలు చేసింది. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ, గఢ్వాల్ మండల అభివృద్ధి సంస్థలకు ఎన్నడూ లేనంత స్థాయిలో రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఘాట్లో నడుస్తున్న 800కు పైగా హోటళ్ల వ్యాపారవేత్తలకు 125 కోట్లకు పైగా రాబడి చేకూరింది.
కాలినడకతో ఆదాయం
2019 మే 9న ప్రారంభమైన ఈ యాత్రలో కేవలం గుర్రపు బండ్ల నుంచి 55 కోట్ల రూపాయల టర్నోవర్, ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయల ఆదాయమూ వచ్చిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సారి భక్తులు కాలినడకన స్వామి దర్శనానికి రావటమే దీనికి కారణం. అందుకే గుర్రాలు, మ్యూల్‌లను ఎక్కువగా ఉపయోగించారు పాదచారులు.
ఇక చిన్న దుకాణాలు, దాబాలన్నీ కలిపి రూ. 40 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందాయి. ప్రత్యేక విషయం ఏంటంటే, యాత్రలో భక్తులు పహారీ వంటకాలను కూడా బాగా ఉపయోగించుకున్నారు. సోన్‌ప్రయాగ్‌లో పహారీ కిచెన్ నిర్వాహకులు ఈ ఏడాది కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు.