డీఎంకే నేత అన్బళగన్ కరోనా వైరస్‌తో మరణించడం తమిళనాడు వాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆయనకు అసలు కరోనా వైరస్ ఎలా సోకింది? ఆయన నుంచి ఇంకెవరికైనా వైరస్ వ్యాపించిందా? ఈ అనుమానాలు.. స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
అక్కడే వైరస్ సోకిందా?
అన్బళగన్.. పశ్చిమ చెన్నై టీ.నగర్‌లోని ఓ శిబిరానికి మే 27న వెళ్లారు. అక్కడున్న 1000 మందికి కూరగాయలు తదితర ఆహార సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపించింది. దీనిని నిర్లక్ష్యం చేసి ఆసుపత్రికి వెళ్లలేదు అన్బళగన్. అనంతరం 29న జరిగిన ఓ పార్టీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. డీఎంకే నేత కరుణానిధి జన్మదిన వేడుకలపై చర్చించారు. దీని తర్వాత ఆయనకు దగ్గు, జ్వరం పెరిగినట్టు తెలుస్తోంది. శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతుండటం వల్ల ఈ నెల 2న అన్బళగన్ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.
4వ తేదీన అన్బళగన్ పరిస్థితి విషమించింది. వెంటనే ఆయనను వెంటిలేటర్‌పైకి మార్చారు. తర్వాతి రోజే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. కానీ ఈ నెల 8న ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.