బంగాల్‌లో ఆరుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో బంగాల్‌లో మరింత మంది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించింది. శనివారం ముర్షిదాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఆరుగురు ఉగ్రవాదులను విచారించిన ఎన్ఐఏ.. మాల్దా ప్రాంతానికి చెందిన మరో ఇద్దరికి వీరితో సంబంధమున్నట్లు గుర్తించింది.
గురువారం రాత్రి ముర్షిదాబాద్‌లో జరిగిన సమావేశంలో వారిద్దరూ పాల్గొన్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామునే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. శనివారం జరిపిన దాడిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. బంగాల్‌లోని ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వీరు విస్తరించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు కాగా వీరికి కశ్మీర్‌లోని వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
వీరి నుంచి పలు సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఇందులోని సమాచారం ఆధారంగా కశ్మీర్లో గుర్తు తెలియని వ్యక్తులతో విద్యార్థులు సంబంధాలు నెరుపుతున్నారని గుర్తించినట్లు చెప్పారు.