'వందేభారత్' సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ రైల్వే. 44 రైళ్ల నిర్మాణానికి గతేడాది పిలిచిన టెండర్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు ప్రభుత్వం. మేకిన్ ఇండియా నిబంధనలతో వారంలోపు మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తామని తెలిపింది.
ఇప్పటివరకు దాఖలైన బిడ్డర్లలో చైనాకు చెందిన కంపెనీ ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 44 రైళ్ల నిర్మాణానికి గత నెలలో వచ్చిన టెండర్లలో ఒకటి చైనాకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ సీఆర్ఆర్సీ పయనీర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం ఆరు టెండర్లు రాగా ఏకైక విదేశీ బిడ్డర్‌గా సీఆర్ఆర్సీ ఉంది.
చైనా కంపెనీకి దక్కే అవకాశం ఉండటంతో..
గురుగ్రామ్‌కు చెందిన పయనీర్ కంపెనీతో చైనాకు చెందిన సీఆర్ఆర్సీ యాంగ్జీ ఎలక్ట్రిక్ కంపెనీ 2015లో జాయింట్ వెంచర్ నెలకొల్పింది. వాస్తవానికి 44 వందేభారత్ రైళ్ల నిర్మాణ టెండర్ ఈ చైనా కంపెనీకు దక్కే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. స్వదేశీ సంస్థలకే ప్రాజెక్టు అప్పగించాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.