2021లో జరగనున్న జేఈఈ, నీట్ పరీక్షల సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది కేంద్ర విద్యాశాఖ. జేఈఈ, నీట్ పరీక్షల్లో అభ్యర్థులు సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలకు సంబంధించి ఆప్షన్స్ ఉంటాయని వెల్లడించింది. అలాగే.. నీట్ 2021కు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక ఖరారు చేయాల్సి ఉందని తెలిపింది.
దేశవ్యాప్తంగా కొన్ని బోర్డులు సిలబస్‌ను తగ్గించిన క్రమంలో నీట్(యూజీ)2021 ప్రశ్నాపత్రంలోనూ జేఈఈ తరహాలో ఆప్షన్లు ఉండనున్నాయని స్పష్టం చేసింది.
నిబంధనల సడలింపు..
ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యాసంస్థల ప్రవేశ నిబంధనల్లో పలు సడలింపులు ఇచ్చింది కేంద్రం. ఇంటర్లో 75 శాతం మార్కులు తప్పనిసరి చేసే నిబంధనను పూర్తిగా తొలగించింది.
రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్
"ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్), గత విద్యా సంవత్సరం కోసం తీసుకున్న నిర్ణయాలను పరిగణించి.. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్లో 75 శాతం మార్కులు తప్పనిసరి నిబంధనను తొలగించాం. ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఎస్పీఏలు, ఇతర సీఎఫ్టీఐల జేఈఈ(మేయిన్స్) ఫలితాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. "
- రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర విద్యా శాఖ మంత్రి
నిబంధనల సడలింపుతో.. జేఈఈ మేయిన్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎన్ఐటీలు ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో 12వ తరగతి బోర్డు పరీక్షల మార్కులను పక్కన పెట్టేస్తారు. గతంలో జేఈఈ మేయిన్స్తో పాటు ఇంటర్లో 75 శాతం మార్కులు లేదా టాప్ 20 పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకునేవారు.
ఇదీ చూడండి:జేఈఈ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువు పెంపు