ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరేళ్ల పాలన సమయం.. 1990 తర్వాత జమ్ము కశ్మీర్ చరిత్రలో అత్యంత శాంతియుతమైన దశగా గుర్తుండిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇక్కడి ప్రజలతో మోదీకి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. జమ్ము కశ్మీర్ విషయంలో.. సత్వర అభివృద్ధి, క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య బలోపేతం, శాంతి భద్రతలు, అందరికీ అభివృద్ధి ఫలాలపై ప్రధాని ఎల్లప్పుడూ దృష్టి సారిస్తారని చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిని జమ్ము కశ్మీర్‌కు వర్తింపచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీతో పాటు పాల్గొన్నారు షా.
"ఆగస్టు 5(ఆర్టికల్ 370 రద్దు) తర్వాత జమ్ము కశ్మీర్‌లోని ప్రతిచోట మార్పు కనిపిస్తోంది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులైనా, కేంద్ర పథకాలైనా, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. భద్రత పరిస్థితులైనా.. అన్నింటిలో మార్పు కనిపిస్తోంది. 2014 నుంచి 2020 వరకు మోదీ పరిపాలించిన ఆరేళ్ల కాలం 1990 తర్వాత కశ్మీర్లో శాంతియుతమైన దశగా చరిత్రలో గుర్తుండిపోతుంది. శాంతి లేకుంటే అభివృద్ధి అసాధ్యం. పర్యాటకం వర్ధిల్లాలన్నా, యువత ఆకాంక్షలను తీర్చాలన్నా శాంతిస్థాపన కీలకం."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయికి తీసకెళ్తానని ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకున్నారని అన్నారు షా. జమ్ము కశ్మీర్ యంత్రాంగం సైతం తన బాధ్యతను వేగంగా నిర్వర్తించిందని, ఆ ఫలితంగానే ప్రభుత్వ పథకాలు కశ్మీర్ ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు. శాంతియుత ఎన్నికలు నిర్వహించడంలో విజయం సాధించినందుకు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను ప్రశంసించారు.