73వ స్వాతంత్ర్య దినోత్సవం దిల్లీ ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరిగింది. కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేశారు ప్రధాని నరేంద్రమోదీ.
ఎర్రకోట వేదికగా వరుసగా ఆరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. మోదీ 2.0 ప్రభుత్వ తొలి 10 వారాల ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. 70 ఏళ్లల్లో ఎవరూ చేయలేని పనులను 70 రోజుల్లో పూర్తిచేసి... ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేసినట్లు వివరించారు.
మెరుగైన భద్రతకు సీడీఎస్...
దేశ భద్రతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మోదీ. త్రివిధ దళాలకు ఉమ్మడి సారథ్యానికి సంబంధించి 19ఏళ్లుగా ప్రతిపాదనగానే ఉన్న 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్' పదవిని సృష్టిస్తున్నట్లు వెల్లడించారు.
"యుద్ధం, ప్రజల రక్షణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ నేను ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా. ఈ విషయంపై ఎన్నో ఏళ్లుగా అధ్యయనం జరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమించడానికి నిర్ణయించాం. తద్వారా త్రివిధ దళాలకు ఒక ప్రభావవంతమైన అధిపతి ఉంటారు. దేశ చరిత్రలో ఇదొక గొప్ప విషయం అవుతుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
'తప్పును సరిచేసే ధైర్యం లేకే...'
ఆర్టికల్ 370 రద్దును తన ప్రసంగంలో ప్రస్తావించారు మోదీ. ఆ నిర్ణయంతో ఒకే దేశం- ఒకే రాజ్యాంగం కల సాకారమైందని హర్షం వ్యక్తంచేశారు. విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
"మేము సమస్యను సహించము, పెంచిపోషించము. ఆర్టికల్ 370ని సమర్థిస్తూ ఏదో ఒకటి అంటున్నారు. దాన్ని సమర్థిస్తున్న వారిని దేశం ప్రశ్నిస్తోంది. ఆర్టికల్ 370, 35ఏ ఎంతో గొప్పది, ఎంతో అవసరమైనది, కశ్మీర్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనది అయితే... 70 ఏళ్లు గడిచినా వాటిని మీరు శాశ్వతం ఎందుకు చేయలేదు? తాత్కాలికంగానే ఎందుకు మిగిల్చేశారు? అంటే... ఈ విషయంలో మంచి జరగలేదని మీకు తెలుసు. కానీ తప్పును సరిచేసే ధైర్యం మీకు లేదనే కదా!"
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఒకే దేశం-ఒకే రాజ్యాంగం, ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం- ఒకే గ్రిడ్‌ను ప్రస్తావిస్తూ జమిలి ఎన్నికల ఆవశ్యకతను గుర్తుచేశారు మోదీ. ఒకే దేశం- ఒకే ఎన్నిక కల సాకారం దిశగా విస్తృత చర్చలు జరగాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు.