కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తన ఆలోచనలను ప్రజలతో పంచుకునేందుకు ప్రారంభించిన వీడియో సిరీస్‌లో... మొదటి వీడియోను రాహుల్ ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు దేశాన్ని బలహీనపరిచాయన్న రాహుల్.. గత ఆరేళ్లుగా దేశ విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థకు చెల్లాచెదురయ్యాయని విమర్శించారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానంలో లోపాలు, పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలోనే సరిహద్దుల్లో... చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
దేశ రక్షణకు అన్ని వ్యవస్థలు దోహదం చేస్తాయన్న విషయాన్ని మోదీ విస్మరించారన్న రాహుల్.. కేంద్ర వైఫల్యం వల్లనే లద్ధాఖ్ ఘటన జరిగిందని విమర్శించారు. నిరుద్యోగిత రేటు గత 5 దశాబ్ధాలలో అత్యధికంగా నమోదైందన్న ఆయన మోదీ పాలనలో మన బలాలే అకస్మాత్తుగా బలహీనతలుగా మారాయని విమర్శించారు.