జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) గురించి తమ ప్రభుత్వం చర్చించలేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతానికి ఎన్ఎఆర్సీ అమలును భాజపా పక్కనబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాలని భాజపా భావిస్తోంది.
దేశమంతా ఎన్ఆర్సీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో సహా పలు మార్లు ప్రకటించారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు అగ్ర నేతలు ఇదే విషయాన్ని పలు ఎన్నికల ర్యాలీల్లో పదే పదే ప్రస్తావించారు. భాజపా దేశాన్ని విభజిస్తోందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకత, ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో భయాందోళనలు భాజపాను పునరాలోచనలో పడేశాయి.