కరోనా వైరస్ బాధితుల కోసం చైనా కేవలం10 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రి నిర్మించి, తన శ్రామిక శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. అయితే భారత్ వినూత్నంగా ఆలోచించి కదిలే ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. అది కూడా ఒకటి రెండు కాదు. ఏకంగా 3.2 లక్షల పడకలు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా?
కదిలే ఆస్పత్రులు...
కరోనా రోగుల కోసం 20వేల బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు భారతీయ రైల్వే అధికారులు. ఈ కోచ్‌లలో 3.2 లక్షల వరకు పడకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 16 జోనుల్లో ఈ ఏర్పాట్లు చేయనున్నారు. సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయానికి అత్యధికంగా 486 బోగీలను, మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఉన్న ముంబయికి 482 బోగీలు కేటాయించారు.
ఇప్పటికే క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చాల్సిన 5,000 బోగీల్లో పనులు ప్రారంభించారు. ఈ 5 వేల బోగీల్లో పనులు పూర్తి అయితే 80,000 పడకలు అందుబాటులోకి వస్తాయి. ఒక బోగీలో 16 పడకలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కేవలం నాన్ ఏసీ బోగీలనే ఐసోలేషన్ వార్డులుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:క్వారంటైన్లో ఆకలితో గడిపి.. కరోనాపై గెలిచి...