"వారణాసిని అభివృద్ధి చేయాలన్న కాశీ విశ్వనాథుడి ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా" అన్న నరేంద్ర మోదీ ప్రచారానికి కాశీ ప్రజలు మరోసారి పట్టం కట్టారు. అఖండ విజయాన్ని అందించారు. వారణాసి అభివృద్ధి జరగాలంటే మోదీ రావాలన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందనడానికి ఆయనకు వచ్చిన మెజార్టీయే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తుండటం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కనీస పోటీని ఇవ్వకపోవడం వల్ల నరేంద్ర మోదీ విజయం సునాయాసమైంది.
2014లో అలా.. ఇప్పుడిలా
"నాకు నేనుగా ఇక్కడికి రాలేదు. పవిత్ర గంగా మాత పిలుపు మేరకే వచ్చా".... 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్యలివి. ఆ మాటలు అప్పుడు బ్రహ్మాస్త్రంగా పని చేశాయి. ఆయన చేసిన భావోద్వేగపూరిత ప్రసంగాలు ఆఖండ విజయాన్ని కట్టబెట్టాయి.
ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాశీ విశ్వనాథుడిని ప్రస్తావించి వారణాసి ఓటర్ల మదిని గెలుచుకున్నారు మోదీ. కాశీని అభివృద్ధి చేసేందుకే మీ ముందుకొచ్చానంటూ ఇచ్చిన హామీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భాజపా కంచుకోట.. కానీ 2004లో..
వారణాసిలో ఓటర్ల సంఖ్య 17లక్షలకు పైనే. సంప్రదాయంగానూ భాజపాకు పట్టున్న ప్రాంతమిది. 2004లో మినహా 1991 నుంచి వరుసగా భాజపా అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. మోదీకి ముందు భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు.
హిందువుల ఆధ్యాత్మిక నగరంగా పేరొందినా.. ముస్లిం జనాభా కూడా కాశీలో ఎక్కువే. అయినప్పటికీ సాక్షాత్తు ప్రధాని అభ్యర్థే పోటీకి దిగడం వల్ల ఎన్నిక ఏకపక్షమైంది. మోదీపై వ్యతిరేకత పెద్దగా లేకపోయినప్పటికీ.. ఉన్న వ్యతిరేక ఓట్లు కాస్తా మహాకూటమి అభ్యర్థి శాలినీ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మధ్య చీలిపోయాయి. మోదీ గెలుపు సునాయాసమైంది.
కారణాలివే..
వారణాసిలో మోదీ అఖండ విజయానికి అనేక కారణాలు. వాటిలో ప్రధానమైనవి ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, ప్రజల్లో ఆయనపై పెరిగిన అపార నమ్మకం.