రాష్ట్రపతి భవన్‌లో మెర్కెల్‌కు మోదీ స్వాగతం భారత్‌లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 5వ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్‌కు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు మెర్కెల్.
"భారత్-జర్మనీ మధ్య చాలా దగ్గరి సంబంధాలున్నాయి. పరస్పర అంశాలపై చర్చిస్తాం. రెండు దేశాల మధ్య చాలా అవగాహన ఒప్పందాలు, ఒడంబడికలను ఆమోదించే అవకాశం ఉంది. ఇవి భారత్-జర్మనీ మధ్య విస్తృత, లోతైన సంబంధాలకు ప్రతీకగా నిలుస్తాయి. విశాలమైన, వైవిధ్యమైన భారత్‌పై మాకెంతో గౌరవం ఉంది."
- ఏంజెలా మెర్కెల్, జర్మనీ ఛాన్సలర్
రెండు రోజుల పర్యటన కోసం మెర్కెల్ నిన్న దిల్లీకి చేరుకున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాలకు సంబంధించి చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ (ఐజీసీ)లో పాల్గొనేందుకు మెర్కెల్ భారత్‌లో పర్యటిస్తున్నారు.
20 ఒప్పందాలు!
భారత్, జర్మనీల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు సమాచారం. వాతావరణ సమస్యలు, నైపుణ్యాభివృద్ధి, కృత్రిమ మేధ, సుస్థిరాభివృద్ధి, భద్రత, ఆర్థిక రంగ సంబంధిత అంశాలపై ఒప్పందాలు జరిగే అవకాశముంది. ఐరోపా సమాఖ్యతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అంశమూ చర్చిస్తారని సమాచారం.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'