భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశ పురోభివృద్ధికి కలాం చేసిన సహకారం భారత్ ఎన్నటికీ మరువదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కలాం స్మృతిలో ఓ వీడియోను ట్వీట్ చేశారు.
"డా.కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి భారత్ ఎప్పటికీ మరిచిపోదు. ఆయన జీవిత ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఉపరాష్ట్రపతి ట్వీట్
జ్ఞానానికి, నిరాడంబరతకి అబ్దుల్ కలాం సారాంశం వంటి వారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భారత రక్షణ, అంతరిక్ష సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో అమూల్యమైన సహకారం అందించారని కీర్తించారు. ప్రతి భారతీయుడికి ఆయన ప్రేరణగా నిలుస్తారని అన్నారు. ఆయన చెప్పిన సూక్తులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు మూడు భాషల్లో ట్వీట్ చేశారు.
'పటిష్ఠ భారత్కు కృషి'
స్వయం సమృద్ధితో కూడిన పటిష్ఠమైన భారతదేశాన్ని నిర్మించాలని కలాం ఎల్లప్పుడూ కోరుకునే వారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత అంతరిక్ష, క్షిపణి కార్యక్రమాలకు కలాం వాస్తు శిల్పి అని అభివర్ణించారు.
ప్రజల రాష్ట్రపతి..
1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం జన్మించారు. 2002-2007 మధ్య భారత 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. రాష్ట్రపతి భవన్ సందర్శన కోసం ప్రజలకు అనుమతినిచ్చారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు దగ్గరై ప్రజల రాష్ట్రపతిగా కీర్తి గడించారు. రాష్ట్రపతిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా పర్యటించి కొత్త తరానికి మార్గనిర్దేశనం చేశారు. 2015లో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.