ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో దేశానికి ఒనగూరిందేమీ లేదని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు భారతీయుల అంచనాలను అందుకోలేకపోయాయని విమర్శలు సంధించింది. 'హౌడీ-మోదీ' ద్వారా తమ స్నేహాన్ని ప్రపంచానికి చాటిచెప్పినా ఫలితం దక్కలేదని ఎద్దేవా చేసింది.
మోదీ ఐరాస ప్రసంగంలో ఆనందపడాల్సిన అంశమేమీ లేదని సీనియర్ కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇక ప్రజల కష్టాలపై దృష్టి సారించాలని ప్రధానికి సూచించారు ఆనంద్ శర్మ.
"మోదీ పర్యటనపై భాజపా సంబరాలు జరుపుకుంటోంది. కానీ ఆ సంబరాలకు సరైనా కారణాలు లేవు. మోదీ పర్యటనలో ఆశించిన ఫలితాలు దక్కలేదు. భారత్‌కు జీఎస్పీ హోదా పునరుద్ధరించేలా ట్రంప్‌ను ఒప్పించడంలో మోదీ విఫలమయ్యారు. హెచ్-1బీ వీసాల తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించ లేకపోయారు."
--- ఆనంద్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నేత
వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయలేకపోవడం వల్ల భారత పరిశ్రమలు తీవ్ర నిరాశ చెందాయని ఆరోపించారు ఆనంద్ శర్మ.
అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌తో చేస్తోన్న పోరాటంపై మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన విద్వేష ప్రసంగాన్ని ఖండించారు ఆనంద్ శర్మ.