తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐరాసలో మోదీ కీలక ప్రసంగం.. ఏం మాట్లాడతారంటే? - ఐక్యరాజ్యసమితిలో మోదీ ప్రసంగం

ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇప్పటి వరకు వివిధ అంశాలపై భారత్‌ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ అత్యంత కీలక ప్రసంగం చేయనున్నారు. ఇప్పటివరకూ ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రధాని భారత వాణిని వినిపించారు. నేటి ప్రసంగంలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తారో లేదో చూడాలి.

ఐరాసలో మోదీ కీలక ప్రసంగం.. ఏం మాట్లాడతారంటే?

By

Published : Sep 27, 2019, 5:02 AM IST

Updated : Oct 2, 2019, 4:23 AM IST

ఐరాసలో మోదీ కీలక ప్రసంగం.. ఏం మాట్లాడతారంటే?

ఐక్యరాజ్య సమితి 74వ సర్వసభ్య సమావేశంలో నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని ప్రసంగంలో ఉండే అంశాలపై అందరి దృష్టి నెలకొంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐరాస వేదికపై మోదీ ప్రసంగించనుండటం ఇదే తొలిసారి. అమెరికా పర్యటనలో భాగంగా ఇప్పటివరకు అనేక కార్యక్రమాలకు హాజరైన ప్రధాని.. వివిధ దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాలుపంచుకున్నారు. అన్నిచోట్లా వివిధ అంశాలపై భారత​ వైఖరిని స్పష్టం చేశారు. అయితే వాటన్నింటిని మించి నేటి సర్వసభ్య సమావేశంలో ప్రధాని ఏం మాట్లాడతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

కశ్మీర్​ అంశంపై ఉత్కంఠ...

మోదీ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తారా? లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ ప్రసంగం అనంతరం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించనున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ తన ప్రసంగంలో ఆర్టికల్‌ 370 రద్దు, మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని ఖండించడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రతినిధులు తెలిపారు.

నానా యాగీ...

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370తో పాటు 35ఏ ను భారత ప్రభుత్వం రద్దుచేసిన అనంతరం అక్కడ మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారని పాక్‌ నానా యాగీ చేస్తోంది. ఏ అవకాశం దొరికినా.. కశ్మీర్‌ అంశాన్నే లేవనెత్తుతూ అంతర్జాతీయ వేదికలపై దాన్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ ముగిసిపోయిన అంశమని ఇక చర్చలంటూ జరిగితే... పీవోకే పైనేనని భారత్​ స్పష్టం చేసింది.

అప్పుడు...

మూడేళ్ల క్రితం జరిగిన ఐరాస 70వ వార్షిక సమావేశాల్లో అభివృద్ధి, పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రపంచ దేశాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. భారత్‌ అభివృద్ధి అజెండాను ఆ లక్ష్యాలు ప్రతిబింబిస్తున్నాయని అప్పటి సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశాలవారీగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా పరస్పర సహకారం అందించుకోవాల్సిన అవసరాన్నీ అజెండా 2030 ప్రధానంగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో అజెండా 2030ని అమలు చేయడంలో భారత్‌ పోషించే నాయకత్వ పాత్ర గురించి ప్రధాని మోదీ వివరించనున్నారు.

Last Updated : Oct 2, 2019, 4:23 AM IST

ABOUT THE AUTHOR

...view details