ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సంచలన ఆరోపణలు చేశారు. బాలాకోట్‌లోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై 2019లో భారత వాయుసేన దాడి సమాచారాన్ని మోదీనే లీక్ చేశారని రాహుల్ అన్నారు. అందుకే అది అర్నబ్ గోస్వామి ఎడిటర్‌గా ఉన్న రిపబ్లిక్ టీవీ ఛానెల్లో మూడు రోజుల ముందుగానేే వచ్చిందని పేర్కొన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"బాలాకోట్ దాడి గురించి మూడు రోజుల ముందే ఓ భారత జర్నలిస్టుకు తెలిసింది. అంటే.. భారత వాయుసేన సైనికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్లే. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, వాయు సేన అధిపతి, హోం మంత్రి.. ఈ ఐదుగురికే బాలాకోట్‌లో జరిగే దాడి గురించి తెలుసు. ప్రపంచంలో మిగతా ఎవ్వరికీ ఈ విషయం గురించి తెలియదు. మరి బాలాకోట్‌లో దాడి జరుగుతుందని ముందే చెప్పిన ఆ జర్నలిస్టుపై దర్యాప్తు ఎందుకు జరపలేదు. ఈ ఐదుగురిలో ఒకరు ఆ సమాచారాన్ని సదరు జర్నలిస్టుకు చేరవేశారు. ప్రధానే ఆ పని చేశారు కాబట్టి, దీని గురించి విచారణ జరపలేదు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత