కరోనాపై పోరులో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకు దేశంలో విధించిన లాక్డౌన్ ముఖ్య కారణమన్నారు. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ. విదేశాల నుంచి విమానాల రాకపోకల్ని నిలిపివేసి, లాక్డౌన్ ప్రకటించే విషయంలో కేంద్రం ఆలస్యం చేసిందన్న విమర్శల మధ్య ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
'లాక్డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'
కరోనాపై విషయంలో కేంద్రం ముందే అప్రమత్తమై, సరైన చర్యలు చేపట్టిందని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. లాక్డౌన్ను ప్రభుత్వం ఆలస్యంగా అమలు చేసిందని ఇటీవల కొందరు విమర్శించిన నేపథ్యంలో ఈమేరకు పరోక్షంగా స్పందించారు ప్రధాని.
దేశంలో మే 3 వరకు లాక్డౌన్: మోదీ
కేంద్రం ముందే అప్రమత్తమై.. భారత్లో ఒక్క కేసు అయినా నమోదు కాకముందే స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించిందని చెప్పారు ప్రధాని. 550 కేసులున్నప్పుడే లాక్డౌన్ వంటి కీలక నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు.
దేశంలో 100 కేసులు నమోదయ్యే ముందే.. విదేశాల నుంచి వచ్చిన వారిని కచ్చితంగా 14రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని ఆదేశించినట్టు తెలిపారు. భారత్ ముందే సరైన చర్యలు తీసుకోకపోతే దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవోనని అన్నారు మోదీ.