తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ భారీ రోడ్​ షో వెనుక వ్యూహమిదే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో భారీస్థాయిలో రోడ్​షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భాజపా అధ్యక్షుడు అమిత్​షా సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. అయితే, నామినేషన్​కు ఒక్కరోజు ముందు మోదీ ఇంత భారీస్థాయిలో రోడ్​ షో నిర్వహించడం వెనుక వ్యూహాలేమిటి. 2014తో పోలిస్తే తనకు ప్రజల మద్దతు తగ్గలేదని మోదీ నిరూపించాలనుకున్నారా? వారణాసిలో తనకెవరూ పోటీనివ్వలేరనే సంకేతాలు పంపాలనుకున్నారా? దేశాన్ని తాము మాత్రమే కాపాడగలమని చెప్పేందుకేనా?

By

Published : Apr 26, 2019, 8:28 AM IST

రోడ్​షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మోదీ భారీ రోడ్​ షో వెనుక వ్యూహమిదే..

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో ఏడు కిలోమీటర్ల పాటు మెగా రోడ్​షో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రోడ్​షోకు హాజరైన ప్రజలతో నగర వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు హోరెత్తాయి. రోడ్​షోలో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సహా పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. వారణాసి లోక్​సభ స్థానానికి నామినేషన్​ వేసే ఒక్కరోజు ముందే మోదీ ఇంత పెద్దస్థాయిలో రోడ్​షో నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

ప్రజాబలం భాజపా వైపేనని చెప్పేందుకే..

2014 కంటేభాజపాకు, తనకు ప్రజాదరణ ఇప్పుడు మరింత పెరిగిందని చాటిచెప్పుకునేందుకే వారణాసిలో భారీస్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్​షో నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారణాసి స్థానం నుంచి దాదాపు మూడు లక్షల 70వేల ఓట్ల మెజార్టీతో గత ఎన్నికల్లో విజయం సాధించారు మోదీ.

ఈ ఐదేళ్లలో వారణాసి ప్రజల్లో మోదీ పట్ల వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని కాంగ్రెస్​ నేతలు కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ఆ నియోజకవర్గాన్ని ఆయన అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసిపై ప్రత్యేక దృష్టి సారించారు.

కాంగ్రెస్​ నేతల ఆరోపణలకు సమాధానమిచ్చేందుకే మోదీ ఇంత భారీ స్థాయిలో రోడ్​షో నిర్వహించారు. తన గెలుపు ఈసారి కూడా నల్లేరుపై నడకేనని చెప్పే ప్రయత్నం చేశారు.

భాజపాలో ఉత్సాహం.. కాంగ్రెస్​లో నిస్తేజం

వారణాసిలో ప్రధాని మోదీ రోడ్​షో విజయవంతమవడం భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎవరు పోటీకి దిగినా భాజపా విజయం తథ్యమనే విశ్వాసాన్ని కలిగించింది.

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారనే ఊహాగానాలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. మోదీపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రియాంక కూడా ప్రకటించారు. ఇక ఆ స్థానంలో హోరాహోరీ తప్పదని అందరూ భావించారు. మోదీకి గట్టిపోటీ తప్పదనుకున్నారు. అంచనాలను తలకిందులు చేస్తూ వారణాసి నుంచి మళ్లీ అజయ్​రాయ్​ పోటీ చేస్తారని కాంగ్రెస్​ ప్రకటించింది. దీంతో అక్కడి కాంగ్రెస్​ శ్రేణులు నిరుత్సాహపడ్డారు.

దేశ భద్రతపై మరోసారి

జాతీయవాదం, దేశ భద్రతపై మరోసారి వారణాసిలో ప్రసంగించారు ప్రధాని మోదీ. దేశం తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే భద్రంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. తనకు దేశ ప్రయోజనాలే ప్రథమమని మోదీ అన్నారు. ఆ తర్వాతే మిగతా విషయాలని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వంలోనే దేశరక్షణ పటిష్ఠంగా ఉంటుందన్నారు.

" గడిచిన ఐదేళ్లలో దేశంలోని ఏ పట్టణం, పవిత్ర స్థలాలు, ఆలయాలపై ఎలాంటి ఉగ్రదాడులు జరగలేదు. పుల్వామాలో 40 మంది జవాన్ల ప్రాణాలను ముష్కరులు బలిగొన్నారు. ఆ ఘటన తర్వాత అదే ప్రాంతంలో ఇప్పటి వరకు 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఇదీ మా ప్రభుత్వ పనితీరు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి"

ABOUT THE AUTHOR

...view details