బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తన ప్రజాదరణ చూసి నిద్రపట్టడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. తనపై కోపాన్ని దీదీ... ప్రభుత్వ అధికారులపై, ఎన్నికల సంఘంపై చూపుతున్నారని విమర్శించారు. కేంద్రం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు దీదీ 'స్పీడ్‌బ్రేకర్'లా మారారని ఆరోపించారు మోదీ.
పశ్చిమ్ బంగాలోని కూచ్బిహర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. రాష్ట్రాన్ని గూండాల చేతులో పెట్టి ప్రజల ఆశలను ముఖ్యమంత్రి చెల్లాచెదురు చేశారని ధ్వజమెత్తారు.
'దీదీ స్కాములతో బంగాల్ ఖ్యాతికి మచ్చ'
"మమత చేసిన 'మా... మాటీ... మానుష్' హామీ ఒకవైపు ఉంది. తృణమూల్ చేసిన పనులు మరోవైపు ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దీదీ... అమ్మను మర్చిపోయి దేశాన్ని ముక్కలు చేసే వారితో కలిశారు. ఇది అమ్మను అగౌరపరిచినట్టే. రాజకీయ లబ్ధికోసం చొరబాటుదారులకు రక్షణ కల్పించి మాతృభూమినీ అవమానపరిచారు. బంగాల్ ప్రజలను తృణమూల్ పార్టీ గూండాలకు అప్పగించి వారి ఆశలను చెల్లాచెదురు చేశారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
శారద, రోస్ వ్యాలీ, నారద కుంభకోణాలతో బంగాల్ ప్రజలను మమతా బెనర్జీ హింసించారని ఆరోపించారు మోదీ. ప్రజలకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం చౌకీదార్ రాబడతాడన్నారు.
తన అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడిన మోదీ.. దేశంలో త్వరలో ఫోన్‌కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చని, అంతర్జాల సేవలూ ప్రపంచదేశాలన్నింటికంటే భారత్‌లోనే తక్కువ ధరలకు లభిస్తాయని అన్నారు.