హరియాణా శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా భాజపా వ్యూహరచనలు చేస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను ప్రచార రంగంలోకి దింపనుంది కమలం పార్టీ. ప్రముఖ నేతలందరినీ ఎన్నికల ర్యాలీల్లో భాగం చేసి ఓటర్లను తమవైపు ఆకర్షించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ప్రధానితో పాటు 40 మంది నేతలు
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, స్మృతీ ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు మొత్తం 40 మంది నేతలతో హరియాణాలో ప్రచార సమరాన్ని మోగించనుంది భాజపా.
ముఖ్యమంత్రులు, ఎంపీలు సైతం..
హరియాణా ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు పలురాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ఎన్నికల ప్రచారంలో దింపనుంది కమలం పార్టీ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా ఎన్నికల ప్రసంగం చేయనున్నారు. వీరితో పాటు హేమామాలిని, మనోజ్ తివారీ, హన్స్ రాజ్ హన్స్, సన్నీ దేవోల్ లాంటి ఎంపీలు సైతం కమలం పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు.
హరియాణాలోని మొత్తం 90 శాసనసభ స్థానాలకు ఈ నెల 21న ఎన్నికల జరుగనున్నాయి.
పంజాబ్‌లోనూ ప్రచారాలు
పంజాబ్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, స్మృతీ ఇరానీతో పాటు పలువురు నేతలు ఆ రాష్ట్రంలో పార్టీ తరఫున ప్రచారాల్లో పాల్గొననున్నారు.