కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో సామూహిక ఉత్సవాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నేతలు. ఈ క్రమంలో హోలీ వేడుకల్లో తాము పాల్గొనటం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా భాజపా అగ్రనేతలు ప్రకటించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హోలీ వేడుకలు చేసుకోనని స్పష్టం చేశారు. అందుకు కరోనాతో పాటు దిల్లీ అల్లర్లు చేలరేగటాన్ని కారణంగా పేర్కొన్నారు ఆప్ అధినేత.
రాష్ట్రపతి భవన్..
కోవిడ్-19 కలవరపెడుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఏడాది హోలీ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ప్రధాని మోదీ..
కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు ప్రధాని మోదీ. హోలీ వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి సామూహిక సమావేశాలు తగ్గించాలని ప్రపంచ దేశాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను ఈ సారి హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా."