ఎన్నికల వేళ వాణిజ్య వర్గాల మెప్పు కోసం చిన్న వ్యాపారులకు హామీల వర్షం కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వర్తకులకు పూచీకత్తు, క్రెడిట్ కార్డు లేకుండా రూ. 50 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. అలాగే చిన్న దుకాణ దారులకు పింఛను పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
దిల్లీలోని తాల్కాతోరా మైదానంలో వర్తక సంఘాలతో సమావేశయ్యారు మోదీ.
"భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులే వెన్నెముక. మళ్లీ మోదీ ప్రభుత్వమే రానుంది. రాగానే.. 'రాష్ట్రీయ వ్యాపారి కల్యాణ్ మండలి'ని ఏర్పాటు చేస్తాం. అలాగే రాష్ట్రీయ చిల్లర వర్తకుల నిధిని ప్రారంభిస్తాం. జీఎస్టీలో నమోదు చేసుకున్న వ్యాపారులకు రూ.10లక్షల ప్రమాద బీమా అందిస్తాం. చిన్న దుకాణ దారులకు పింఛను పథకాన్ని తీసుకొస్తాం. స్టార్టప్ రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 లక్షల రుణాలను ఇచ్చేందుకు కొత్త పథకాన్ని తీసుకొస్తాం."