అసోం ప్రజల హక్కులకు నాది భరోసా: నరేంద్ర మోదీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో చెలరేగుతున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లుపై అస్సామీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
అసోం ప్రజల హక్కులకు నాది భరోసా: నరేంద్ర మోదీ "అసోం సోదర సోదరీమణులు పౌరసత్వ సవరణ బిల్లు - 2019 ఆమోదంపై ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని నేను భరోసా ఇస్తున్నాను. మీ హక్కులు, ప్రత్యేకమైన గుర్తింపు, అందమైన సంస్కృతిని ఎవరూ హరించలేరు. ఈ సంస్కృతి మరింతగా వృద్ధిచెంది పరిఢవిల్లుతుంది.
బిల్లులోని 6వ నిబంధన ప్రకారం అసోం ప్రజల రాజకీయ, సాంస్కృతిక, భాషా, భూ హక్కులను రాజ్యాంగబద్ధంగా పరిరక్షించడానికి నేను, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధాని ట్వీట్
భగ్గుమంటున్న ఈశాన్యం
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపుర, అసోంలో నిరసనల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. గువాహటిలో నిరవధిక కర్ఫ్యూ విధించినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. దీనితో సైన్యం ఫ్లాగ్ మార్చ్ చేపట్టింది. త్రిపురలో అసోం రైఫిల్స్‌ను రంగంలోకి దించారు. తిన్సుకియా, డిబ్రూగఢ్ జిల్లాల్లో సైన్యాన్ని మోహరించిననట్లు అధికారులు వెల్లడించారు.
బుధవారం జరిగిన ఆందోళనల్లో నిరసనకారులు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి ఇళ్లపై రాళ్లతో దాడులు చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. వందలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు.
ఇంటర్నెట్ బంద్...
అసోం ముఖ్యమంత్రి సొంత పట్టణమైన చబువాలో రైల్వే స్టేషన్ కు నిప్పుపెట్టారు. పానిటోలా రైల్వే స్టేషన్ కూడా దగ్ధం చేశారు. బస్సులు, వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ఆందోళనల నేపథ్యంలో అసోంలోని పది జిల్లాల్లో అంతర్జాల సేవల్ని నిలిపివేశారు. త్రిపురలో మంగళవారం నుంచే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు కోల్‌కతా విమానాశ్రయం నుంచి డిబ్రూగఢ్‌కు వెళ్లే విమాన సర్వీసులను రద్దుచేసినట్లు కోల్‌కతా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: పంతం నెగ్గించుకున్న కేంద్రం- 'పౌర' బిల్లుకు పార్లమెంటు ఆమోదం