మోదీకి వారణాసి ప్రజల నీరాజనం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా రోడ్‌షో నిర్వహించారు. రేపు రెండోసారి నామినేషన్ వేయనున్న సందర్భంగా ఈ ర్యాలీని చేపట్టారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవ్యా విగ్రహానికి నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు మోదీ.
అడుగడుగునా జన నీరాజనాలు...
మోదీ ర్యాలీతో వారణాసి నగరం కాషాయ శోభను సంతరించుకుంది. ప్రధాని మోదీకి వారణాసి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. వీధులన్నీ మోదీ నినాదాలతో మార్మోగాయి.
కాషాయ వస్త్రాలతో...
రోడ్‌షో సందర్భంగా కాషాయ రంగు కుర్తా, అదే రంగు కండువాను ధరించారు మోదీ. ప్రధాని ధరించిన దుస్తులు నగర పౌరులను మెప్పించాయి. లంక, అస్సీ ప్రాంతాల్లోని ప్రజలు మోదీ కుర్తాను కీర్తిస్తూ నినాదాలు చేయడం విశేషం.
ఏడు కిలోమీటర్లపాటు సాగిన ర్యాలీ దశాశ్వమేథ ఘాట్ వద్ద గంగానది హారతితో ముగిసింది. మోదీ వెంట భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేపు నామినేషన్
వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు భాజపా కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని నామపత్రాల దాఖలు కోసం ఊరేగింపుగా వెళతారు.
నామినేషన్‌కు ఎన్డీఏ ప్రముఖులు...
రోడ్‌షోలో పాల్గొనలేకపోయిన జేడియూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వన్, ఏఐఏడీఎంకే నేతలు మోదీ నామినేషన్‌కు హాజరవుతారని సమాచారం