తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలుపెరుగని ప్రస్థానంలో అతడే ఒక సైన్యం

నరేంద్ర మోదీ.. ఇది కేవలం ఒక పేరు కాదు.. ప్రభంజనం. సాధారణ ఛాయ్​వాలా నుంచి భారత ప్రధానిగా.. ఒక ప్రపంచ నేతగా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. 2014 ఎన్నికల్లో తన హవాతో.. ఒంటి చేత్తో భాజపాను గద్దెనెక్కించిన మోదీ.. 2019 ఎన్నికల్లో విపక్షాల విమర్శనాస్త్రాలకు... అతడే ఒక సైన్యం అనేలా సమాధానమిచ్చారు. ప్రజలు మరోసారి నరేంద్రుడికే పట్టాభిషేకం చేశారు.

By

Published : May 23, 2019, 5:45 PM IST

అలుపెరుగని ప్రస్థానంలో అతడే ఒక సైన్యం

పార్టీని విజయ పథంలో నడిపించగల రాజకీయ చతురత...! ప్రత్యర్థులను బలంగా ఎదుర్కొనే సమర్థత...! ప్రజలను ఆకట్టుకోవటంలో ఘనాపాఠి...! మాటల మరాఠీ...! ఇవన్నీ కలగలిపిన నేత ప్రధాని నరేంద్ర మోదీ. సాధారణ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి... ప్రధాని స్థాయికి ఎదిగారు ఆయన. గురువు ఎల్‌కే అడ్వాణీ మార్గదర్శకత్వంలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన మోదీ... ఇప్పుడు భాజపాకు పెద్ద దిక్కుగా మారారు.

యూపీఏ వరుస విజయాలతో దూసుకుపోతున్న వేళ... ఒంటి చేత్తో పార్టీని విజయ తీరాల వైపు నడిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా ఏ మేర వీచిందో... అప్పటి ఫలితాలే స్పష్టం చేశాయి. ఈ ఐదేళ్లలో ఆయన ప్రభ మసకబారిందని ప్రతిపక్షాలు ఎంతగా ఎద్దేవా చేసినా... దేశవ్యాప్తంగా మరోసారి కాషాయ జెండా ఎగిరేలా చేశారు. తన చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేశారు.

ఛాయ్​వాలా నుంచి ప్రధానిగా...

నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ. ఒకప్పుడు సాదాసీదా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. ఛాయ్‌వాలా. ఇప్పుడు... ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ గల భారత దేశ ప్రధానమంత్రి. సాధారణ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలు అధిరోహించటమంటే మామూలు విషయం కాదు. ఎర్ర తివాచీ పరిచి... ఆయనను విజయం ఆహ్వానించలేదు. ఈ గెలుపు వెనుక ఎంతో కృషి, పట్టుదల దాగున్నాయి.

1950 సెప్టెంబర్‌ 17న ప్రస్తుత గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో దామోదర్‌దాస్‌ మూల్‌చంద్‌ మోదీ, హీరాబెన్‌ మోదీకి జన్మించారు నరేంద్ర మోదీ. బాల్యంలో వాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో తండ్రి నిర్వహించే టీ దుకాణంలో... తర్వాత బస్‌ టెర్మినల్‌లో తన సోదరుడి టీ స్టాల్‌లోనూ పని చేశారు మోదీ. 1967లో పాఠశాల విద్య పూర్తిచేసుకున్న ఆయన 8 ఏళ్ల వయసు నుంచే స్థానిక ఆర్​ఎస్​ఎస్​ శాఖా సమావేశాల్లో చురుగ్గా పాల్గొనే వారు. 1968లో అత్యంత చిన్నవయసులో యశోదాబెన్‌ను వివాహమాడారు.

1978లో యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో బీఏ పట్టా పొందారు మోదీ. 1983లో గుజరాత్‌ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏ పట్టా సాధించారు. 1960లో భారత్‌-పాక్ యుద్ధ సమయంలో... భారత సైనికులకు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా సేవలందించారు. ఆయనలోని చురుకుదనం గమనించిన సీనియర్‌ నాయకులు... ఏబీవీపీ సభ్యుడిగా చేర్చుకున్నారు.

అంతర్ముఖునిగా మోదీపై ఓ ముద్ర ఉండేది. అది పోగొట్టుకునేందుకు ఎంతో శ్రమించారు ఆయన. పార్టీ వ్యవహారాలు చూసుకోవటంలో క్రమంగా చురుకుదనం ప్రదర్శించారు. సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్యకు చేపట్టిన రథయాత్ర సహా... కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు చేపట్టిన యాత్ర నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అప్పటి వరకు కొన్ని వ్యవహారాలకే పరిమితమైన ఆయన... ఈ యాత్రల నిర్వహణతో అనుభవం గడించారు. ఆ తరవాత... మురళీ మనోహర్ జోషీ చేపట్టిన ఐక్యతా యాత్ర నిర్వహణ బాధ్యతలు కూడా మోదీయే నిర్వర్తించారు.

ఈ క్రమంలోనే... పార్టీ కోసం శ్రమించే వ్యక్తిగా... భాజపా సీనియర్ నేతల దృష్టిలో పడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో వివిధ హోదాల్లో పని చేసిన మోదీ 1985లో భాజపాలో అడుగు పెట్టారు. 1986లో ఎల్‌.కే. అడ్వాణీ భాజపా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ గుజరాత్‌ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. 1990లో జాతీయ ఎన్నికల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.

1994లో అడ్వాణీ ప్రోద్బలంతో ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మోదీ... క్రమంగా పార్టీలో మంచి స్థానం సంపాదించుకున్నారు. 1995లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీని విజయతీరాల వైపు నడిపించటంలో కీలకంగా వ్యవహరించారు. ఇక గుజరాత్‌ భాజపా నేత శంకర్‌సింగ్‌ వాఘేలా కాంగ్రెస్‌లోకి ఫిరాయించగా... పార్టీని కాపాడేందుకు మోదీ చొరవ చూపారు. 1998లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు.

గుజరాత్​ ముఖ్యమంత్రిగా...

2001లో గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యుడిగా మోదీని నియమించారు ఎల్‌.కే. అడ్వాణీ. అదే సంవత్సరం గుజరాత్‌ ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌ అనారోగ్యానికి గురికావడం, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం వల్ల పటేల్‌ స్థానంలో మోదీని గుజరాత్‌ సీఎంగా భాజపా అగ్రనేతలు ఎంపిక చేశారు. 2001 అక్టోబర్‌ 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

రాజ్‌కోట్‌ 2 నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించడం ద్వారా 2002 ఫిబ్రవరి 24న మోదీ గుజరాత్‌ అసెంబ్లీలోకి ప్రవేశించారు. 2002 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో భాజపా గుజరాత్‌లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుజరాత్‌లో పార్టీని గెలిపించుకుని... తిరుగులేని నేతగా ఆవిర్భవించారు మోదీ. 13 ఏళ్ల పాటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. 2012లో మణినగర్ నుంచి నాలుగో సారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయం సాధించారు మోదీ.

మోదీ నేతృత్వంలో 2012 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గానూ 115 చోట్ల విజయ పతాకం ఎగరేసింది భాజపా. మణినగర్‌ నుంచి గెలుపొందిన మోదీ... వరసగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది 2013 మార్చిలో భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవటంలో ఈ బోర్డుదే ప్రధాన పాత్ర. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగానూ ఆయన వ్యవహరించారు.

ప్రధానిగా...

2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా మోదీ చరిష్మాకు అద్దం పట్టాయి. 9 ఏళ్ల యూపీఏ పాలన తరవాత... ఓటర్లంతా ఎన్‌డీయేకు సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారు. ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగిన మోదీ... భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

ఆయనకు ఆయనే సాటి...

ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించటంలో తనదైన శైలి ప్రదర్శించే మోదీ... ఆ వాగ్ధాటి అలా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. భాయియోం.. ఔర్‌ బెహనోం అంటూ ప్రసంగం మొదలు పెట్టి... అసలు విషయాన్ని సూటిగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చెప్పటంలో దిట్ట. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశమంతా నమో మంత్రం జపించిందంటే... ఆయన వాక్చాతుర్యం అందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాలి. ఆహార్యంలోనూ మోదీ తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు. కుర్తా పైజమాతో పాటు వాటిపై రంగురంగుల జాకెట్లతో ఆయన వేషధారణ మిగిలిన నేతల కంటే భిన్నంగా కనిపిస్తుంది.

మోదీ ప్రభ కనుమరుగైందని విపక్షాలు గొంతు చించుకున్నా... అందులో ఏ మాత్రం నిజం లేదని రుజువు చేశారు ఆయన. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయన చరిష్మా అత్యధిక ఓట్లు కొల్లగొట్టటంలో కీలక పాత్ర పోషించింది. మొత్తానికి భాజపా పగ్గాలు మోదీ చేతిలో ఉన్నంత కాలం ఓటమి మాటే ఉండదని పార్టీ శ్రేణుల మాట నిజం చేశాయి ఫలితాలు.

ABOUT THE AUTHOR

...view details