సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ మంత్రంతో నవ భారత నిర్మాణానికి బాటలు వేస్తున్నట్లు హౌడీ-మోదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం భారత్ నిరంతరం శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ-మోదీ’ సభలో పాల్గొన్నారు మోదీ. అందరూ బాగున్నారా అంటూ పలు భారతీయ భాషల్లో సంబోధించి సభికులను ఉత్సాహపరిచారు. వైవిధ్య భారతీయ భాషలు స్వేచ్ఛాయుత సహజీవనానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు.‘‘
" దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు భారత్‌లో బాగా చర్చలో ఉన్న పదం అభివృద్ధి. భారత్ వల్లిస్తున్న అతిపెద్ద మంత్రం సబ్‌కా సాథ్-సబ్ కా వికాస్. భారత్ అనుసరిస్తున్న అతిపెద్ద విధానం ప్రజా భాగస్వామ్యం. భారత్ ప్రవచిస్తున్న అతిపెద్ద నినాదం.. సంకల్పం నుంచి లక్ష్యాన్ని సిద్ధించుకోవడం. నవభారతం అన్నది భారత్‌కు ఉన్న అతిపెద్ద సంకల్పం. నవభారతం అన్న స్వప్నాన్ని నిజం చేసుకోవడం కోసం భారత్ రాత్రిపగలూ కష్టపడుతోంది. ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే భారత్ ఇతరులతో కాకుండా తమతో తామే పోటీ పడుతోంది. మాకు మేమే మార్పు చేసుకుంటున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
అసాధారణ విజయం
2019 లోక్‌సభ ఎన్నికల్లో భారత ఓటర్లు ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు ప్రధాని. ఆ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచమంతా చాటాయని... 61 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. ఒక రకంగా ఆ సంఖ్య అమెరికా జనాభా కంటే రెట్టింపు అని తెలిపిన ప్రధాని... భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో మహిళలు ఆ ఎన్నికల్లో ఓటు వేశారని ఉద్ఘాటించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు మరో కొత్త రికార్డును సృష్టించాయని... 60 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీతో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 'ఇది మోదీ కారణంగా జరగలేదు. భారతీయుల వల్ల మాత్రమే జరిగిందన్నారు' ప్రధాని.