తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జంబో కేబినెట్​కు మోదీ-షా కసరత్తు - ప్రమాణస్వీకారం

లోక్​సభ ఎన్నికల్లో అపూర్వ విజయం సొంతం చేసుకున్న భాజపా నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సమాయత్తమవుతోంది. కేబినెట్ మంత్రుల​ కూర్పులో ఏన్డీఏలోని మిత్రపక్షాల నేతలకు సముచిత గౌరవమిచ్చే అవకాశం కనిపిస్తోంది.

జంబో కేబినెట్​కు మోదీ సర్కారు కసరత్తు

By

Published : May 30, 2019, 1:16 PM IST

Updated : May 30, 2019, 3:16 PM IST

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భాజపా... మరోసారి తన (ఎన్డీఏ) మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సమాయత్తమవుతోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు అమిత్​షాతో కలిసి కేంద్ర మంత్రివర్గ కూర్పుపైనా భారీ కసరత్తు చేశారు.

మంత్రివర్గ కూర్పుపై నిన్న, మొన్న సుమారు నాలుగైదు గంటలపాటు చర్చించిన అగ్రనేతలు మోదీ-షా... ఈ రోజూ సమావేశమయ్యారు. కేబినెట్​లోకి తమ మిత్రపక్షాల వారికీ స్థానం కల్పించడానికి నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఇన్నాళ్లూ తమకు సరైన ప్రాతినిధ్యంలేని రాష్ట్రాల్లోనూ భాజపా విజయభావుటా ఎగురవేసింది. అందువల్ల ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకులకూ కేబినెట్​లో స్థానం కల్పించనున్నట్లు వినికిడి. తుది జాబితాను రాష్ట్రపతికి సమర్పించనున్నారు.

ప్రధానితోపాటే... ప్రమాణ స్వీకారం

ఇవాళ రాత్రి ఏడు గంటలకు దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ ముందున్న బహిరంగ ప్రాంగణంలో మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో సహా 62 మంది కేంద్రమంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కేబినెట్​ మంత్రులు వీరే..!

భాజపా అగ్రనేతలు అర్జున్​ మేఘవాల్, రాజ్​నాథ్​సింగ్​, సుష్మా స్వరాజ్​, నితిన్​ గడ్కరీ, సురేష్​ ప్రభు, డీవీ సదానంద గౌడ, హర్షవర్ధన్​, రవిశంకర్​ ప్రసాద్​, జగత్ ప్రకాశ్ నడ్డా, చౌదరీ బీరేంద్ర సింగ్​, స్మృతీ జుబిన్​ ఇరానీ, మేనకా గాంధీ, పీయూష్​ గోయల్​, ప్రకాశ్​ జావ్​డేకర్​, నిర్మలా సీతారామన్​, ధర్మేంద్రప్రధాన్​, థావర్ చంద్ గహ్లోత్​, నరేంద్ర సింగ్ తోమర్, రాధామోహన్ సింగ్​, ముక్తార్​ అబ్బాస్ నఖ్వీ, మీనాక్షి లేఖి, బాబుల్​ సుప్రియో, అర్జున్ ముండా, అనురాగ్ ఠాకూర్​, కిరణ్​ రిజిజు, పురుషోత్తం రూపాలా, దిలీప్ ఘోస్​, జయంత్​ సిన్హా, గిరిరాజ్​ సింగ్​, గజేంద్ర సింగ్ షెకావత్​లకు మరలా కేంద్ర కేబినెట్​లో స్థానం కల్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రానున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అమిత్​షా.. భాజపా అధ్యక్షుడిగానే కొనసాగుతారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో మోదీ ఉన్నట్లు పార్టీ వర్గాల భోగట్టా. అతనికి ఆర్థిక, హోం, రక్షణ, విదేశీవ్యవహారాల శాఖల్లో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉంది.

కొత్తముఖాలకూ అవకాశం

తాజా కేబినెటలో కొత్తవారికీ స్థానం కల్పించనున్నారు. వారిలో సురేష్​ ఆనందీ ఒకరు. మరోవైపు 2019లో భాజపాలో చేరిన బాలీవుడ్ నటుడు సన్నీ దేయోల్​కూ మంత్రిపదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ భాజపా నేత కిషన్​రెడ్డికీ మొదటి సారి కేబినెట్ పదవి దాదాపు ఖరారైంది. అమిత్​షా నుంచి స్వయంగా పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన భాజపా అక్కడి నేతలకూ కేబినెట్లో స్థానం కల్పించే అవకాశం ఉంది.

మరోవైపు ఇన్నాళ్లూ కేంద్ర ఆర్థికమంత్రిగా సేవలందించిన భాజపా అగ్రనేత అరుణ్​జైట్లీ ఆరోగ్య కారణాల రీత్యా పదవీ బాధ్యతలు చేపట్టలేనని ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఎన్డీఏ మిత్రపక్ష నేతలకూ అవకాశం..

భాజపా...తన మిత్రపక్ష పార్టీలన్నింటికీ కనీసం ఒక కేబినెట్​ పదవి కేటాయించడానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన రాంవిలాస్​ పాసవాన్​కు​ (లోక్​జనశక్తి ) మరోసారి అవకాశం దక్కనుంది. అలాగే మరో మిత్రపక్షం శివసేన నుంచి అరవింద్ సావంత్​కు కేబినెట్ పదవి దక్కింది. జేడీయూ పార్టీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానంగా ఖాయంగా కనిపిస్తోంది.

శివసేన, జేడీయూలకు ఒక కేంద్రమంత్రి, మరో సహాయమంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. లోక్​జన శక్తి పార్టీ, అప్నాదళ్​, శిరోమణి అకాలీదళ్​లకు ఒక్కో మంత్రి పదవి దక్కే సూచనలున్నాయి. తమిళనాడులో మిత్రపక్షమైన అన్నాడీఎంకే నుంచి ఒకరికి కేబినెట్ మంత్రిపదవి ఇవ్వడానికి భాజపా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు..

మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి బిమ్​స్టెక్ దేశాధినేతలు హాజరుకానున్నారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి రాహుల్​గాంధీ, సోనియాగాంధీ, గులాంనబీ ఆజాద్​, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. సినీ, పారిశ్రామిక రంగ దిగ్గజాలు వస్తున్నారు.

ఇదీ చూడండి: మహాత్మునికి, అటల్​జీకి ప్రధాని మోదీ నివాళులు

Last Updated : May 30, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details