తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉద్యోగాలు అడిగితే చందమామను చూడమంటున్నారు' - కాంగ్రెస్ మహారాష్ట్ర

ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్​ షాలు వాస్తవ సమస్యల నుంచి ప్రజలను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. ఉద్యోగాలు అడిగితే చంద్రుని వైపు చూడమని చెబుతున్నారని మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్.

'ఉద్యోగాలు అడిగితే చందమామను చూడమంటున్నారు'

By

Published : Oct 13, 2019, 6:11 PM IST

Updated : Oct 13, 2019, 8:01 PM IST

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. లాతూర్​ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, మీడియా... వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు రాహుల్. యువత ఉద్యోగాలు కావాలని అడిగితే చంద్రుని వైపు చూడమని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇటీవల ఇస్రో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

లాతూర్​లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న రాహుల్​

" చంద్రుని వైపు చూడండి. హిందూస్థాన్ రాకెట్​ను పంపిందన్నారు. బాగా చెప్పారు. ఇస్రోను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. రెండు రోజుల్లో రాకెట్ వెళ్లలేదు. దాని ప్రయోజనాలు మోదీ పొందుతున్నారు. చంద్రునిపైకి రాకెట్ వెళ్లినంత మాత్రానా దేశంలోని యువత కంచాల్లోకి భోజనం రాదు. చైనా అధ్యక్షుడితో కూర్చొని మోదీ చాయ్​ తాగారు. డోక్లాంలో ఏం జరిగిందని మోదీ ఆయనను అడిగారా? "

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

15 మంది ధనికులకు రూ.5.5 లక్షల కోట్ల రుణాలను మోదీ సర్కారు మాఫీ చేసిందని ఆరోపించారు రాహుల్. రైతుల సమస్యలు, నిరుద్యోగంపై మాత్రం కేంద్రం, మీడియా మౌనం వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. చంద్రయాన్​, ఆర్టికల్ 370 రద్దు గురించి మాత్రమే వారు పదే పదే ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు రాహుల్​.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో చెన్నైలో మోదీ భేటీపైనా విమర్శలు చేశారు రాహుల్​. 2017లో డోక్లాంలోకి చైనా బలగాలు మోహరించిన విషయాన్ని సమావేశంలో ప్రధాని ప్రస్తావించారో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు.

ఇదీ చూడండి: ఆర్టికల్ 370పై విపక్షాలకు మోదీ సవాల్​

Last Updated : Oct 13, 2019, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details