"నరేంద్ర-దేవేంద్ర సూత్రం గత ఐదేళ్లలో సూపర్ హిట్ అయింది. రానున్న రోజుల్లో మహారాష్ట్ర... అభివృద్ధిలో నూతన శిఖరాలకు చేరుతుంది. నరేంద్ర, దేవేంద్ర కలిసి ఉంటే 1+1=11 అవుతుంది, రెండు కాదు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పన్వేల్ బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలివి. ప్రధాని మాటలు మరోమారు నిజమయ్యాయి. కలెక్షన్ కాస్త తగ్గినా... "నరేంద్ర-దేవేంద్ర 2.0"హిట్ అయింది.
ఐదు నెలల్లోనే డబుల్ ధమాకా...
2019 మే 23...! ప్రజాస్వామ్య భారత చరిత్రలో అత్యంత అరుదైన రోజు. నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ అసాధారణ విజయం సాధించిన క్షణం. ఐదేళ్ల పాలన తర్వాత 2014ను మించిన స్థాయిలో ఓటర్లు భాజపాకు బ్రహ్మరథం పట్టడం... మోదీ పనితీరుకు లభించిన ప్రజామోదంగా నిలిచింది.
కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 5 నెలలు అయిందో లేదో... మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. మళ్లీ అదే వ్యూహంతో, ఉత్సాహంతో బరిలోకి దిగింది ఎన్డీఏ కూటమి. అభివృద్ధి మంత్రం, మోదీ ప్రజాకర్షణ శక్తికి ఓటర్లు మరోమారు ఫిదా అయ్యారు. నరేంద్రుడు చెప్పిన 'డబుల్ ఇంజిన్' సిద్ధాంతాన్ని నమ్మి దేవేంద్రుడికి పట్టం కట్టారు.
ఓటర్లలో నమ్మకం....
2019 సార్వత్రిక సమరాన్ని ముందుండి నడిపించిన ప్రధాని మోదీ... మహారాష్ట్ర ఎన్నికలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విస్తృత ర్యాలీలు నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు, ముమ్మారు తలాక్ చట్టం, ఎన్ఆర్సీ వంటి సాహసోపేత చర్యలను ప్రస్తావిస్తూ తమది చేతల సర్కారని నిరూపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజల్లో నమ్మకం కలిగించగలిగారు.
భాజపా అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
మహారాష్ట్రలో ఫడణవిస్ సర్కార్ అమలుచేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే సర్కార్ ఉంటే కలిగే లాభాలను ప్రజలు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
దేవేంద్రుడి నాయకత్వం....
బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి అయిన దేవేంద్ర ఫడణవిస్ అందరినీ ఏకం చేశారు. వివాద రహితుడిగా పేరు గాంచారు. వ్యూహ చతురతపై అందరి ప్రశంసలు పొందారు. టికెట్ల కేటాయింపులోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమిలోనే ఉంటూ విమర్శించే శివసేనతోనూ స్నేహపూర్వకంగా మెలిగారు.