"పాకిస్థాన్ మన పొరుగుదేశం. నాకు తెలిసి పాక్‌తోనే కాకుండా ప్రతిదేశంతోనూ ఆరోగ్యకరమైన చర్చలుండాలి. ముంబయి దాడి సమయంలో మేం ప్రతిఘటించాం. ఇప్పుడు విమానాలను పంపాం. కానీ అది సరైన చర్య కాదు. ప్రపంచంతో అలా వ్యవహరించకూడదు. ఓ 8 మంది వచ్చి మనపై దాడి చేస్తే.. వారి దేశం మొత్తం మీద పడిపోవటం సరికాదు. న్యూయార్క్ టైమ్స్, ఇంకా కొన్ని వార్తాపత్రికల్లో చదివాను. మనం నిజంగా దాడులు చేశామా? 300 మందిని చంపామా? ఆ విషయం నాకు తెలియదు. కానీ ఓ పౌరుడిగా నాకు తెలుసుకునే హక్కు ఉంది."
- శ్యామ్ పిట్రోడా, కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు
ప్రజలు క్షమించరు: మోదీ
పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు కాంగ్రెస్ మద్దతు పలుకుతోందని ఆరోపణలు చేశారు. ప్రజలు క్షమించరు అనే హ్యాష్‌ట్యాగ్‌తో వరుస ట్వీట్లు చేసి, కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు మోదీ.
"రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన సలహాదారు పాకిస్థాన్ జాతీయ దినోత్సవాలను కాంగ్రెస్ తరఫున ప్రారంభించారు. అదీ భారత సైన్యాన్ని అవమాన పరుస్తూ సాగడం విచారకరం."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
"తీవ్రవాదంపై పోరుకు కాంగ్రెస్ అయిష్టంగానే వ్యవహరిస్తుందని దేశం మొత్తానికి తెలుసు. ఆ విషయాన్ని కాంగ్రెస్ సామ్రాజ్యానికి నమ్మిన బంటు ఒప్పుకున్నారు.
ఇది నూతన భారతం. ఉగ్రవాదులకు అర్థమయ్యే భాషలోనే వారికి సమాధానమిస్తాం."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
అలవాటుగా మారింది
సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ వ్యాఖ్యలనూ తప్పుబట్టారు మోదీ.
"ఉగ్రవాదులకు క్షమాపణలు చెప్పటం, సైన్యాన్ని ప్రశ్నించటం విపక్షాలకు అలవాటుగా మారింది. కశ్మీర్‌ను కాపాడుతున్న వారిపై రామ్‌గోపాల్ వంటి సీనియర్ నేత అనుమానాలు వ్యక్తం చేయటం దురదృష్టకరం. ఆ వ్యాఖ్యలు అమరుల కుటుంబాలను మరింతగా బాధిస్తాయి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి