జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో చైనా వేసిన అడ్డుపుల్ల... భారత్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. ఇది ముమ్మాటికీ ప్రధాని నరేంద్ర మోదీ వైఫల్యమేనని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు మోదీ భయపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
మసూద్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టే అవకాశాన్ని భారత్ కోల్పోయిందని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడటానికి ఎందుకు సంశయిస్తున్నారో సమాధానం చెప్పాలని ట్విట్టర్ వేదికగా మోదీకి రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు.
- గుజరాత్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి మోదీ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
- దిల్లీలో జిన్‌పింగ్‌ను ఆలింగనం చేసుకున్నారు మోదీ.
- చైనా పర్యటనకు వెళ్లినప్పుడు జిన్ పింగ్- మోదీ ఒకరికొకరు నమస్కరించుకున్నారు.
- ఇన్ని చేసిన మోదీ జిన్ పింగ్‌తో మాట్లాడేందుకు ఎందుకు భయపడుతున్నారో" అని రాహుల్ ట్వీట్ చేశారు.
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే అధినేత మసూద్‌పై ఆంక్షల విషయంలో తమకు మరింత సమయం కావాలంటూ చైనా అడ్డుపుల్ల వేసింది.
"చైనా ఇలా మనకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు... ప్రధాని గతంలో ఆ దేశ ప్రర్యటనకు వెళ్లడం వల్ల ఏం లాభం జరిగిందన్న ప్రశ్న ప్రతి ఒక్క భారతీయుడి మెదడును తొలిచేస్తోంది" అని రాహుల్ వ్యాఖ్యానించారు.
"ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం జరుపుతున్న పోరుకు ఇది చీకటి రోజు. మసూద్ అజార్‌పై ఆంక్షలను చైనా అడ్డుకోవటం పరోక్షంగా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రమూకను ప్రోత్సహించటమే"నని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా అన్నారు.