ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. ఎలాంటి సమాచారం లేకుండా కేంద్రం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం వల్లే అసంఘటిత రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
97లక్షల మంది కార్మికులపై..
లాక్డౌన్.. కరోనాపై చేసిన దాడి కంటే పేదలపైనే అధిక ప్రభావం చూపిందని రాహుల్ విమర్శించారు. దినసరి కూలీలు, వలస కార్మికులు, చిన్న మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. లాక్డౌన్ నిర్ణయం సుమారు 97 లక్షల మంది వలస కార్మికులను ఇంటి బాట పట్టించిందని ఆందోళన వ్యక్తంచేశారు. వలస కార్మికులందరికీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు రాహుల్.