నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ 2.0.. అధికార పగ్గాలు చేపట్టి 50 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిపాలనపై నివేదికను భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజల ముందుంచారు. సాధారణంగా సర్కారు గద్దెనెక్కిన మొదటి 100 రోజులకు నివేదిక సమర్పిస్తుంటారు. అయితే 50 రోజుల పరిపాలనపై నివేదిక సమర్పించాలని ప్రధాని సలహా ఇచ్చినట్లు నడ్డా తెలిపారు.
మోదీ 2.0 సర్కారు 50 రోజుల ప్రోగ్రెస్ కార్డ్ - సులభతరం
ప్రధాని నరేంద్ర మోదీ 2.0 సర్కారు 50 రోజుల పాలనపై ప్రగతి నివేదిక సమర్పించారు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రజల జీవన శైలిని మెరుగుపర్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. దేశం ప్రగతి పథంలో పయనించేందుకు అవసరమైన మార్గాలను ఈ 50 రోజుల పాలన ప్రతిబింబించిందని అభిప్రాయపడ్డారు.
"మోదీ సర్కారుకు 50 రోజులు పూర్తయ్యాయి. ఎన్నో గొప్ప పనులు జరిగాయి. భవిష్యత్తులో జరిగే మంచికి ఎన్నో సంకేతాలిచ్చాయి. నీటి నుంచి చంద్రుడి వరకు విజయాలు దక్కాయి. వాటితో పాటు గ్రామాలు, పేదలు, కర్షకులు, కార్మికులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే పనులు జరిగాయి. 2022 కల్లా స్వచ్ఛమైన మంచి నీటి సదుపాయంతో కోటి 95 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంటున్నాం. ప్రజల జీవితాన్ని మరింత సులభతరం చేస్తాం." - జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, 2024 కల్లా ప్రతి ఇంటికి నల్లా వంటి విషయాలను నడ్డా ప్రస్తావించారు. చిన్న వ్యాపారులకు పింఛను, వీరమరణం పొందిన పారామిలిటరీ దళాల పిల్లలకు ఉపకార వేతనం వంటి ప్రభుత్వ నిర్ణయాలను గుర్తుచేశారు.
- ఇదీ చూడండి: 'ఆవు-ఆక్సిజన్'పై సీఎం కథ విన్నారా..?